నేడు ప్రజలు లేని దేశంలో
నిన్నటిదాకా మేము దేశంలేని మనుషులం
పగతో కురిసిన బాంబుల వర్షంలో
పూర్తిగా తడిసిన మాంసం ముద్దలం
ఇప్పుడు రక్తం మా దేహంలో తప్ప
అంతటా స్వేచ్ఛగా ప్రవహిస్తోంది
కరెంటుకు తాగునీటికే కాదు
ఇక్కడ కన్నీటికీ అవకాశం లేదు
నిలువెల్లా గాయాలపుండైన శరీరంలోంచి
బయటపడిన ఎముకలగూడులా
అనంత శిథిలాలమధ్య అక్కడక్కడా
నగంగా నిలబడిన బంగళాలు
గుడ్లుపీకేసిన కంటి బొరియల్లా
ధ్వంసమైన రక్షణ బంకర్లు
శరణార్ధి శిబిరాలను కూడా వదలని
క్షిపణుల రాజ్యకాంక్షను ఎవరు చల్లార్చగలరు?
తెగిపడిన కాళ్ళూ చేతులు
సగం కాలిన మొండాలు
ఛిద్రమైన పిల్లలదేహాలు
ఏవీ బతికున్నవాళ్ళ లెక్క తేల్చడంలేదు
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు ఆవిరైపోయిన ఆశతో వెతికేవారికి మధ్య
అంతకంతకు పెరుగుతున్న అగాధం
అటువైపు జరిగిన ఉత్పాతానికి
ఇటువైపు జరుగుతున్న ఉన్మాదమే సమాధానమని సమాధానపడుతున్న సంకుచిత ప్రపంచం
మా ఆత్మగౌరవానికి ఆక్సిజన్ లాగేసింది
నీ తరువాతి దాడిలో కూడా బలయ్యేది
మరికొన్ని శాంతి పావురాలేనని మర్చిపోకు
నిన్ను నాదేశంలోకి అనుమతించి
ఆనక నాఅస్తిత్వాన్ని నీకే అప్పగించి
అనాధల్లా మిగిలిపోయిన మేమంతా
మీరెవరు గుర్తించకపోయినా సరే
ఇక్కడి మూలవాసులమని గుర్తుపెట్టుకోండి
నన్ను నన్నుగా ప్రకటించుకోనీయక
నిలువనీడ లేకుండాచేసిన వాళ్ళప్రక్కన
నిస్సిగ్గుగా నిలబడుతున్న రాజ్యాలుమాత్రం
ఈ యుద్ధభూమికి జవాబు బాకీపడ్డాయి
– పెనుగొండ బసవేశ్వర్, 9441159615