ప్రముఖ రచయిత పి.చంద్రశేఖర ఆజాద్‌గారికి కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయనతో జరిపిన ముఖాముఖి..
మాయాలోకం నవలలో వస్తు వైవిధ్యం గురించి చెప్పండి?
మాయాలోకం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ఒక మారుమూల గ్రామీణ నేపథ్యంతో రాసిన పిల్లల నవల. ఇందులో ప్రధాన పాత్రలు పిల్లలు. ఈ గ్రామానికి మూడు నాలుగు కిలోమీటర్ల అవతల ఓ రైల్వే స్టేషన్ వుంటుంది. అది కూడా రోజుకి ఒకసారి ఓ రెండు నిమిషాలు ఆగుతుంది. తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో తాత దగ్గర వుండి చదువుకునేందుకు బెంగళూరు నుండి వచ్చిన అశోక్, అదే గ్రామానికి చెందిన బుల్లిబాబు, చిన్ని, గీతలు ఒకే బడిలో చదువుకుంటారు. వీరిలో బుల్లిబాబు చాలా మొరటు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా చలించడు. అశోక్ ఆ బడిలో చేరటంతో పిల్లల మధ్య పోటీ మొదలవుతుంది. అవన్నీ సహజ సిద్దమైన సన్నివేశాలతో నడుస్తుంటాయి. బుల్లికి బడిలో వచ్చిన అనుభవం వల్ల తమ కుటుంబమంతా కలిసి వుండటం మంత్రాలతో సాధ్యం అనుకుంటాడు. ఆ గ్రామానికి అడుక్కోవటానికి వచ్చే ఓ సాధువును మంత్రాలు నేర్పించమని వెంటపడతాడు. చివరికి వచ్చీరాని భాషలో ఉత్తరం రాసి బోల్డన్ని డబ్బుల్తో వస్తానని వెళ్తాడు. అతన్ని మిగతా ముగ్గురు పిల్లలు ఎలా కాపాడుకున్నారు. అశోక్ కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది ఇందులో కీలకం. హాస్యం, జీవితం, గ్రామంలోని… పరిస్థితులు ఇవన్నీ రేఖామాత్రంగా ఈ నవలలలో చిత్రించే ప్రయత్నం చేశాను.
ఇప్పటి దాకా మీరు చేసిన సాహిత్య కృషి, మీ సృజన ఎక్కువగా దేనిపై కేంద్రీకరించారు?
1971లో మా కాలేజ్ సావనీర్‌లో తొలికథ అచ్చయింది. ఇప్పటి వరకు 85 నవలలు, 18 నవలికలు, 850 వరకు కథలు, 15 కాలమ్స్, వ్యాసాలు, కవిత్వం, రేడియో, టీవీ సీరియల్స్ 5000, సినిమా సంస్థల నిర్వహణ… ఇలా ఇన్ని దశాబ్దాలుగా అన్ని రకాల ప్రక్రియల్లో రచనలు చేశాను. చేస్తున్నాను. సమాజంలో సమస్యలు ముందుకొచ్చిన ప్రతి సందర్భానికీ కథ, నవల, కాలమ్, వ్యాసాలు రాశాను. వివిధ పత్రికలు వాటిని ప్రచురించాయి.
ఆయా సందర్భాన్ని బట్టి అన్ని రూపాల్లో కృషి చేశాను. ముఖ్యంగా పిల్లలు నా జీవితంలో భాగం అయ్యారు. ఫిలాసఫీ, తాత్వికత నాకు సోవియట్ రచనల నుండి అబ్బాయి. సరళంగా చెప్పే ప్రయత్నం, ఎక్కువ టోన్‌తో మాట్లాడని రచనలు నన్ను ప్రభావితం చేశాయి. అవి నాకు సరళత్వాన్ని నేర్పినా నా రచనలు అంత త్వరగా కొరుకుడు పడవు అంటారు. మనం దేనిమీద కేంద్రీకరించాలన్నది పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఏది రాస్తే అచ్చవుతుందనేది నా కొలబద్ద కాదు. ఏ పత్రికకు రాసినా నా దృష్టితో, నా పరిమిత అవగాహనతో రాశాను. ప్రచురించారు. ఆదరించారు.
మీ నేపథ్యం, రచనా రంగంలోకి రావటానికి ప్రేరణ?
మాది కమ్యూనిస్టు నేపథ్యం. మా తండ్రి లక్షణరావు తెలంగాణ పోరాట సమయంలో కడలూరు జైలులో ఆరేండ్లు వుండి 1962లో మా చిన్నతనంలో చనిపోయారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ చీలలేదు.
నన్ను రచయితను చేసింది ప్రకృతి. మా మైదానం, మా చింతచెట్లు, అప్పటి పిల్లలు, ఆటలు, పాటలు, అన్ని రంగాల్లో పైకి రమ్మని చిన్నప్పటినుండి పెనుగులాట. అంతులేని దారిద్య్రం. చదివింది తక్కువ. అయినా రచయితగా నిలబడడానికి కారణం అది మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తుందనే నమ్మకం. ఇవన్నీ చెప్పాలంటే ఇక్కడ కుదరదు. నా రచనల్లో నా జీవితం కూడా వుంది. నేను కమర్షియల్ రచయితను కాకపోయినా అవసరాల కోసం రాసుకోవలసిన స్థితి. వారు ఇచ్చే 50, 100 రూపాయలు నాకు వేలతో సమానం.
నాకు ప్రజలే ప్రేరణ : నా బాల్యం, నా ప్రయాణం తెలిసిన వారు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. అన్ని కష్టాల నుండి, అవమానాల నుండి ఎదిగాను. నాకు తెలిసిన వాడుక భాషలో ఇన్ని దశాబ్దాలు కొనసాగటం వేలాది పేజీలు రాయటంలోని వేదన, ప్రేరణ నా తల్లికి, భార్యకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. కొందరు మిత్రులకు తెలుసు.
అవార్డు ప్రకటనపై మీ స్పందన?
”మీ రచనలు చదివి కవులు, రచయితలు అయినవారున్నారు. అలాగే ఉద్యోగరీత్యా మంచి స్థితుల్లో వున్నవారున్నారు. అది మీకు అసలయిన అవార్డు” అని మిత్రుడి మాట. ‘అందమైన పూలతోట’, ‘మా హృదయం’ అవి బాల సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలు నిజానికి పిల్లల పుస్తకం, ఆట.. ఈ రెండు నవలు కూడా ఇంతకుముందు పరిశీలనలోకి వెళ్లాయి. ఇవే కాదు, జమిందారు కోట, దేవత ఓ దేవతా, దారి తప్పిన పిల్లవాడు, రేపు రానున్న అన్వేక్షనం, ఏంజల్, ఇవన్నీ ఆధునిక పిల్లల నవలలు. వారికోణం నుండి చెప్పినవి. అందుకు వారిని దగ్గరగా చూశాను. మాట్లాడాను. కాబట్టే అవి పుట్టాయి. ఈ ప్రకటనను నేను ఊహించలేదు. ఇంకాస్త ఆలస్యం కావచ్చు అనుకున్నాను. రెండు రాష్ట్రాలవారు పోటీలో వుంటారు. అనేక రిజర్వేషన్స్, లెక్కలుంటాయి.
కాగా 70 సంవత్సరాల వయసులో ఈ అవార్డు ప్రకటించారు. ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు తగ్గిపోయాయి. అందుకు కారణం నాలుగు దశాబ్దాల నుండి పిల్లల కోసం కథ, నవల, కాలమ్, రేడియో, టెలీఫిల్మ్స్, సినిమా… ఇన్ని విభాగాల్లో పనిచేశాను. పిల్లల ప్రపంచం శీర్షిక ద్వారా కొంతమందిని పరిచయం చేశాను. మేం రాస్తున్నప్పుడు ఈ అవార్డు లేదు. పెద్ద పోటీలు లేవు. ఏ నవల రాసినా అందులో సామాజిక సమస్య వుంటుంది. అందుకే ఇది తాతగా కాదు, ఓ బాలుడిగా స్వీకరిస్తాను. ఆకాశంలో హరివిల్లు విరిస్తే పిల్లలు తొలకరి జల్లుల్లో ఎంత పులకరిస్తారో అంత అనుభూతిగా వుంది. ఇప్పుడు పిల్లలు కూడా రచనలు చేస్తున్నారు. అలాంటి వారికి ఒక్కసారన్నా ఈ అవార్డు ప్రకటిస్తే అప్పుడు ఈ పిల్లవాడు అంకుల్, తాత గర్వపడతాడు. ఇది నా ఆశ.
బాల సాహిత్యంలో రాసవలసిన మార్పులు?
నిన్నటి పిల్లలు వేరు, ఈ నాటి పిల్లలు వేరు. వారి హృదయం ఒక్కటే .అయితే తెలుగు చదువుతున్నావారు తక్కువ. ఈ సాహిత్యంలో మార్పులు రావాలంటే తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, పత్రికలు, మీడియా వారితో పాటు యాక్టివిస్టులు పూనుకోవాలి. అప్పుడే మార్పు వస్తుంది.
ఫ్యాంటసీ, సాహసం, హాస్యం, సైన్స్, ఇలా అనేక రకాల జోనర్స్‌లో రాయాలి. పదేండ్లు దాటిన పిల్లల కేంద్రంగా నా రచనలుంటాయి. ఇప్పుడు కావలసింది ఆధునిక బాల సాహిత్యం. ఇది అంత ఈజీ కాదు. అది పిల్లల కోసం హృదయాలను అకింతం చేసుకున్నవారు, నిశిత పరిశీలన చేసేవారు మాత్రమే రాయగలరు.
సంవత్సరం పిల్లల చేతుల్లో సెల్‌ఫోన్లు వుంటున్నాయి. అందుకు తగ్గ రచనలు చేయాలి. వివిధ భాషల్లో రకరకాల ఆధునిక పాత్రలు, సిరీస్‌లు వస్తున్నాయి. గ్రామ సీమల్లో పిల్లలు ఎంతగా స్పందిస్తున్నారో. ఇన్ని చదువుల ఒత్తిళ్ల నుండి ఓ పిల్లల ప్రపంచాన్ని, స్వప్నలోకాలను సృష్టించుకోవటానికి చేయగలిగింది చేయాలి. అన్ని దేశాల్లో భాషాల్లో మహారచయితలుగా పేరు పొందినవారు పిల్లల కోసం అనేక రూపాల్లో రచనలు చేశారు. మన తెలుగులో ఏ కారణాల చేతనైనా వారు పిల్లల కేసి దృష్టి సారించలేరు. అదో విషాదం.
వర్తమాన రచయితలకు మీ సూచనలు?
ఒకటి రెండు రచనలు చేసి అవార్డులు ఆశించవద్దు. పాతతరం నుండి ఆధునిక తరం వారి రచనలు చదవండి. అసలు విషయం మనకు ప్రయాణం జీవితం. గదుల్లో కూర్చుంటే మంచి రచనలు రావు. ప్రయాణాలు చేయాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వారి దగ్గర అనంతమైన సంపద వుంది. తరగని గనులున్నాయి. విమర్శను ఆహ్వానించండి. చిరు ప్రశంస చాలు. వాటిని తలకు ఎక్కించుకోవద్దు. ఎవరు ఎందుకు ప్రశంసలు కురిపిస్తారో, ఎందుకు అతిగా విమర్శిస్తారో గుర్తెరగాలి. సాహితీ ప్రపంచం అనేక రకాలుగా చీలిపోయింది. మనకు కొలబద్ద మానవీయ కోణం. ఇది. ఏ వాదానికయినా జోడించగలగాలి. బాధలు పడుతున న వారందరూ ఒంక్కటే అని గ్రహించనంత కాలం అవి ఏకపక్షంగా వుంటాయి. మీ అనుభవాల నుండే మీకు పాఠాలు దొరుకుతాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలు.
మోహన్‌కృష్ణ, 8897765417