అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌ నిర్దోషి

అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌ నిర్దోషిఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను అల్‌ అజీజియా స్టీల్‌ మిల్‌ అవినీతి కేసులో నిర్దోషిగా మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రకటించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఆయన నాయకత్వం వహించడానికి గల ప్రధాన చట్టపరమైన అడ్డంకి తొలగిపోయింది. 2001లో తన తండ్రి సౌదీ అరేబియాలో పెట్టిన స్టీల్‌ మిల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టును ఒప్పించడంలో విఫలమవడంతో 2018 డిసెంబరులో షరీఫ్‌కు ఏడేళ్ళ జైలు శిక్ష పడింది. భారీగా జరిమానా కూడా విధించారు. విచారణ సందర్భంగా షరీఫ్‌ తరపు న్యాయవాది అంజాద్‌ పర్వేజ్‌ మాట్లాడుతూ, షరీఫ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ప్రాసిక్యూషన్‌ ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయిందన్నారు. అందువల్లే తన అమాయకత్వాన్ని నిరూపించుకోవాలంటూ బాధ్యతను తన క్లయింట్‌పై నెట్టారని అన్నారు. అవెన్‌ఫీల్డ్‌ కేసులో కూడా షరీఫ్‌ ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ కేసులో కూడా ఆయనకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఫ్లాగ్‌షిప్‌ అవినీతి కేసులో కూడా ఆయనకు ఉపశమనం లభించింది. 2018లోనే ఆయన్ని కోర్టు అమాయకుడిగా ప్రకటించింది. అయితే, జాతీయ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) హైకోర్టులో ఆ తీర్పును సవాలు చేసింది.
మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు ఏమిటి, ఏ ప్రాతిపదికన నిందితుడిని నిరూపించుకోవాల్సిందగా కోరుతున్నారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ఎబి ప్రాసిక్యూటర్‌ను కోరారు. అయితే దీనిపై తిరిగి విచారణకు ఆదేశిస్తూ ట్రయల్‌ కోర్టుకు కేసును బదిలీ చేయాలని ఎన్‌ఎబి కోరింది. అందుకు కోర్టు తిరస్కరించింది.