– ప్రత్యర్థి వ్యూహ, ప్రతివూహ్యాల అమలుపై ఆరా..
– ప్రత్యర్థుల సమాచారంపై అభ్యర్థుల దృష్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రధాన పార్టీల్లో కోవర్టుల హైరానా మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో కొత్తగా చేరుతున్న వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న కాంక్షతో అభ్యర్థి తన బలంతో పాటు ప్రత్యర్థి బలాలను అంచనా వేసేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ నిఘా పెడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో.. వారి వ్యూహాలేమిటి.. ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారో.. ఎప్పటికప్పుడూ సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం తమ మనుషులను ఇతర పార్టీల్లోకి చేర్చేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కోవర్టులతో ప్రత్యర్థి ఆలోచనలు, వ్యూహాలను తెలుసుకుని వారి కంటే ముందే అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సమయం ముంచుకోస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు, వినూత్న ప్రచారాలు, ఎత్తుగడలతో ముందుకెళ్తారు. కానీ ఈసారి సరికొత్త రాజకీయం తెరపైకి వస్తున్నట్టు అర్థమవుతోంది. తన పార్టీలోని మనుషులను ప్రత్యర్థి పార్టీలోకి చేర్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ఎత్తుగడలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యర్థి గెలుపు కోసం రచిస్తున్న వ్యూహాలేమిటి? బలం, బలహీనతలేమిటి? ఎవరెవరిని కలుస్తున్నారు.. తదితర అంశాలను కోవర్టుల ద్వారా ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి కదలికలను తెలుసుకోవడమే కాకుండా ముందే అవతలి అభ్యర్థి ప్రణాళికలను అమలు చేస్తుండటంతో సదరు అభ్యర్థి అవాక్కవుతున్నారు. గ్రేటర్‌లోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీలోనూ ప్రస్తుతం నూతన కార్యకర్తలపైనే దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని నియోజకవవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు, సీనియర్ నేతలు ప్రధాన పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా నూతన కార్యకర్తల ద్వారా అందిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీ నేతలు అప్పటికప్పుడు సదరు నేతల ఇంటికి వెళ్లి పదవులు, డబ్బు ఆశ చూపి కొనసాగేలా చూసుకుంటున్నారని సమాచారం.
పదవులు.. డబ్బు ఆశ చూపి తమ వైపు..
ఇతర పార్టీల్లో చేరుతున్న కొత్త కార్యకర్తలతో ప్రత్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒక పార్టీ అభ్యర్థి డివిజన్ స్థాయిలో ఉన్న కీలక నేతలను, యువజన సంఘాలు, మహిళలను ఎలా తనవైపు తిప్పుకుంటున్నాడో.. వారికి ఎలాంటి తాయిలాలు ఇస్తున్నారో.. సదరు పార్టీలో డివిజన్, వార్డు, మండల స్థాయిలో కీలక నేతలెవరు.. వారికి అభ్యర్థికి మధ్య సత్సంబంధాలున్నాయా లేదా? వంటి అంశాలను మరో పార్టీ అభ్యర్థి కోవర్టు కార్యకర్తల ద్వారా సేకరిస్తున్నారు. తద్వారా వారి వ్యూహాలను పసిగట్టడంతో పాటు అవతలి పార్టీ అభ్యర్థితో డివిజన్, మండలస్థాయి కీలక నేతల మధ్య మనస్పర్థలు ఉంటే సదరు అభ్యర్థులు అక్కడ వాలిపోతున్నారు. పదవులు ఆశచూపి.. భారీగా తాయిలాలు ఇచ్చి తమవైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.