పెండింగ్‌ హామీలపై నజర్‌

 Nazar on pending guarantees– సిద్ధమై రండి : మంత్రులకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం
– ‘ఎన్నికల కోణం’లోనే సమావేశం నేడు రాష్ట్ర క్యాబినెట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికలల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా సోమవారం పలు కీలక నిర్ణయాలను వెలువరించనున్నారు. అందుకోసమే రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని పలు అంశాలను కూడా అమలు చేసి చూపించామంటూ కేసీఆర్‌ చెబుతూ వస్తున్నారు. తమను ప్రతీ ఎన్నికల్లోనూ ఓటర్లు ఆదరించటానికి ఇదే ప్రధాన కారణమంటూ ఆయన పునరుద్ఘాటిస్తు న్నారు. కానీ, వివిధ తరగతులు, పలు వర్గాలకు చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయని ఇటు ప్రతిపక్షాలు, అటు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాటిపై ప్రభుత్వం కూడా విమర్శలపాలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో గతంలో హామీ ఇచ్చి… అమలు కాకుండా పోయిన ముఖ్యమైన, ప్రజలకు అత్యంత అవసరమైన, వారికి తక్షణం లబ్ది చేకూర్చే అంశాలపై దృష్టి సారించాలంటూ సీఎం… మంత్రులను ఆదేశించారు. అలాంటి విషయాలను మంత్రివర్గంలో చర్చించి, తక్షణమే నిర్ణయాలను వెలువరిద్దామంటూ అందుకనుగుణంగా క్యాబినెట్‌కు ప్రిపేరై రావాలంటూ మంత్రులను కేసీఆర్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది.
అధికార వర్గాలు కూడా సోమవారం జరిగే క్యాబినెట్‌… ఫక్తు ఎన్నికల కోణంలోనే
కొనసాగనున్న దని అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో ఏయే అంశాలను చేర్చబోతోంది..? కర్నాటకలో ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి ఏవి..? వాటిని హస్తం పార్టీ కంటే ముందుగానే ఇక్కడ ప్రభుత్వం తరపున ప్రకటిస్తే ఎలా ఉంటుందనే దిశగా కేసీఆర్‌ దృష్టి సారించనున్నారనీ, కీలకాంశాలపైనే క్యాబినెట్‌లో చర్చ కొనసాగనుందని తెలిసింది. మొత్తం 40 నుంచి 50 ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయాలను ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రధానంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆర్టీసీ ఉద్యోగులకు జీత భత్యాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ (పీఆర్సీ), మధ్యంతర భృతి (ఐఆర్‌), ఉపాధ్యాయుల హేతుబద్ధీరణ తదితరాంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించబోతున్నట్టు సమాచారం. సాధ్యాసాధ్యాలు, ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఓట్లు గుమ్మరించే పథకాలు, కార్యక్రమాలకు మంత్రివర్గం అధిక ప్రాధాన్యతనిచ్చి… పచ్చజెండా ఊపనుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే 2014లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్‌… దళితులకు మూడెరకాల భూమి, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర హామీలనిచ్చారు. ఇవి పేరుకే ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వెల్లువెత్తుతున్నాయి. వీటితోపాటు 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య కూడా ఏండ్ల తరబడి అపరిష్కృతంగానే ఉంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల(ఒకరకంగా ఎలక్షన్లకు ముందు ఇదే చివరి సెషన్‌ కావొచ్చు)ను నిర్వహించబోతున్న గులాబీ దళపతి… ఇలాంటి పెండింగ్‌ అంశాలపై ఎలాంటి నిర్ణయాలను వెలువరిస్తారో చూడాలి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించబోయే క్యాబినెట్‌ భేటీకి మంత్రులంతా సిద్ధమవుతున్నారు.