నిదురపిల్లను దొరకబట్టాలి

కవిత్వం జీవితాన్ని శోధిస్తుంది. కవి ఎలా తనలోపలికి తాను చూస్తున్నాడో కూడా బయటపెడుతుంది. కవులు సామాజికత మీదనో, స్త్రీల సమస్యల మీదనో, ఇంకేదో వస్తువు మీదో కవిత్వం రాస్తుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో తమలోని అనుభూతులను కవిత్వం చేస్తుంటారు. ఇక్కడ నేను చర్చించబోయే కవితలోని అంశం కూడా అనుభూతి ప్రధానమైనదే. కవికి ఎంతో లోతైన భావుకత ఉంటే తప్ప ఇలాంటి కవితలు సృష్టించడవు. అలా అనుభవాలను, అనుభూతిని మేళవించి కవితను రాసిన కవి మందరపు హైమవతి. వారు ఎంత సుప్రసిద్ధ కవినో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈ మధ్యనే ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పురస్కారం అందుకున్నారు.

కవి తమ ఇంటి సభ్యులతోని అనుబంధాన్ని రాయటం, ఇంకా స్నేహితులకు సంబంధించిన విషయాలను కవిత్వం చేయటం చూస్తుంటాం.
కవి పూలను చూసినప్పుడు ఎలా అనుభూతి చెందుతాడో, ఇంకేదో అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా అనుభూతి చెందుతారో తెలియజేస్తూ కవిత్వం రాయటం చూస్తుంటాం. ఇక్కడ ఈ కవి ‘నిదురపిల్ల’ అనే శీర్షికతో నిద్రపట్టడం లేదన్న విషయాన్ని కవిత్వం చేయటం ప్రత్యేకించి చూడాల్సిన విషయం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి శీర్షికలు పెట్టడం మూలాన కవికి మేలు జరుగుతుంది. పాఠకుడు శీర్షికలోనే వస్తువును పట్టుకోగలుగుతాడు. శీర్షికలోనే వస్తువు గురించి తెలిసినంత మాత్రాన నష్టమేమి లేదు. ఇలాంటి సందర్భాల్లో అభివ్యక్తి ప్రధానపాత్ర పోషిస్తుంది. కవి ఈ అభివ్యక్తిని సాధించింది.
ఈ కవిత ఎత్తుగడలోనే సులువుగా దారాన్ని అందించింది. ఈ కవి కవితల్లో చాలా ఎత్తుగడలు సాధారణంగానే ప్రారంభమవుతాయి. వీరి కవిత్వ ధార సాధారణం నుండి సంక్లిష్టత వైపుగా పయనించడం గమనిస్తుంటాం. చేయితిరిగిన కవులు ఈ పని చేయగలరు. మొదట సాధారణ వాక్యంతో మొదలుపెట్టి రెండవ లైన్‌లో పోలికను జొప్పించి కవిత్వం చేసింది. కవి ఈ వాక్యాల్లో ఒడ్డున కొట్టుకొంటున్న చేపపిల్ల అనటం, కనురెప్పల తలుపులు అనటంలో కొత్త అభివ్యక్తిని సాధించింది. ‘ఎంత ప్రయత్నించినా నిదురరావట్లే’ అనే విషయాన్ని చెప్పటానికి కవి పై పోలికలను వాడింది.
వస్తువును నడిపించే విధానంలో నిద్రకు సంబంధించిన పరిస్థితుల్లోంచే ‘రాత్రి’ని గూర్చి మాట్లాడింది. మనం సరిగ్గా నిద్రపోయినప్పుడే మనం తెల్లవారుజామున ఉత్సాహంగా ఉంటాం. మనం నలతగా ఉన్నామంటే రాత్రి తీగ చిగురించనట్టేనని కవి అభిప్రాయం. మనం క్షణాల్లో పడుకోవటమనే అర్థంలో ‘నిద్రపువ్వు ప్రసవించదు’ అనే కవి నూతన ప్రయోగాన్ని గమనించవచ్చు. నిద్రకు, కవికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నిద్రను త్యజించి కవిత్వం రాస్తుంటారు కాబట్టి నిద్ర కూడా వాళ్ళ మీద అలిగి తొందరగా రెప్పల మీదికి చేరుకోదు. నిద్రలేమి అనేది చాలా మందిని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. ఆ కోణంలోంచి కూడా ఈ కవితను చూసినప్పుడు ఎంతోమందికి వర్తించే వస్తువు ఇది.
నిద్రకు, కోరికలకు విలోమాను సంబంధముంది. అవి పెరిగితే ఇది తగ్గుతుందన్న సూత్రాన్ని బలంగా నమ్మవచ్చు. కోరికే నిద్రాభంగానికి ప్రధాన కారణం. కోరికలు నెరవేర్చుకోవాలనే ఆరాటంలో సమయాన్ని గమనించరు. నిద్రను పక్కకు పెడుతారు.
ఈ విషయాన్ని చెప్పటానికి కవి రాసిన వాక్యం ‘తలపుల జాతరలో తప్పిపోయిన పిల్ల’ అక్షరసత్యం.
నిద్రను వెతుక్కునే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మనసును ప్రశాంతం చేసుకుంటారు. ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. తొందరగా బెడ్‌ మీదికెళ్ళి కళ్ళు మూసుకుంటారు. ఇవన్నీ చేసే ప్రయత్నాలే. కానీ కవి ఏమంటున్నారంటే కోరికలు, వాటి సంబంధిత ఒత్తిడులను తగ్గించుకోవాలని పరోక్షంగా సూచిస్తున్నారు. నిద్ర రాకపోవటానికి గల కారణాలను వెతుక్కునే వారికి ఈ కవిత ఆరోగ్యమాత్ర. కోరికలను తగ్గించుకుంటూ నిదురపిల్లను దొరకపట్టుకోవటమనేది ఎవరికైనా శ్రేయస్కరం.
నిదురపిల్ల
అటుదొర్లి ఇటుదొర్లి పొర్లుదండాలు పెట్టినా
ఒడ్డునపడి కొట్టు కుంటున్న చేపల్లా
కనురెప్పల తలుపులు మూతపడవు
రాత్రి తీగ చిగురించదు
నిద్ర పువ్వు ప్రసవించదు
తలపుల జాతరలో తప్పిపోయిన పిల్ల
తెల్లవార్లూ కాళ్ళు నొప్పి పుట్టేలా వెదికినా దొరకదు
– మందరపు హైమావతి
– డా||తండా హరీష్‌, 8978439551