ఎన్‌ఈపీ, సీపీఎస్‌ను రద్దు చేయాలి విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై నిరసన

– 11,12,13 తేదీల్లో మండలాల్లో పాదయాత్రలు
– కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ సమస్యలపై 20న చలో ఎస్పీడీ కార్యాలయం
– గురుకుల టీచర్ల సమస్యలపై ఆగస్టు 5న హైదరాబాద్‌లో మహాధర్నా
– టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణను పెంచి పోషించేలా ఉన్న జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. భారత రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామిక, శాస్త్రీయ విలువలతో కూడిన ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌-సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్దరించాలని తెలిపింది. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని వర్చువల్‌ పద్ధతిలో సోమవారం నిర్వహించారు. అనంతరం టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.ఏడు లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పొదుపు మొత్తాలపై ఇచ్చే పన్ను రాయితీని రూ.మూడు లక్షలకు పెంచాలని కోరారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో మండలాల్లో పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చేనెల 12న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతామని పేర్కొన్నారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణాధికారుల పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలని జంగయ్య, చావ రవి డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో సర్వీస్‌ పర్సన్లను నియమించాలని కోరారు. బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని, నెల మొదటి తేదీన వేతనాలివ్వాలని, ట్రెజరీల్లో పాసై ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని తెలిపారు. బకాయి ఉన్న రెండు డీఏ వాయిదాలను విడుదల చేయాలని, రెండో పీఆర్సీ కమిటీని నియమించి ఈ ఏడాది జులై ఒకటి నుంచి ఆర్థిక ప్రయోజనంతో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థల్లోని ఉద్యోగులకు ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. శ్రమకు తగిన వేతనాలివ్వాలని పేర్కొన్నారు. గురుకుల విద్యా సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్‌ పాఠశాలలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సింగరేణి తదితర విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయా యాజమాన్యాల వారీగా దశలవారీ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 17న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, వచ్చేనెల ఐదో తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ సమస్యలపై ఈనెల 20న చలో ఎస్పీడీ కార్యాలయం కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఈ పోరాట కార్యక్రమాలన్నింటిలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు.
డిమాండ్లు
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)ని రద్దు చేయాలి.
 జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌-సీపీఎస్‌)ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానా(ఓపీఎస్‌)ని పునరుద్ధరించాలి.
 ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.ఏడు లక్షలకు పెంచాలి. పొదుపు మొత్తాలపై ఇచ్చే రాయితీని రూ.మూడు లక్షలకు పెంచాలి.
 దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి.
 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ తదితర తాత్కాలిక ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి.
 రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.