అర్హతలేని వైద్యాన్ని అరికడతాం…టీఎస్‌ఎంసీకి కొత్త భవనం

– వైద్యవిద్య ఫీజుల నియంత్రణ
– హెచ్‌ఆర్‌డీఏ ప్యానెల్‌ మ్యానిఫెస్టో విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అర్హత లేకుండా వైద్యమందిస్తున్న వారిని అరికడతామని హెల్త్‌ కేర్‌ రిపార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) తెలిపింది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ)కి కొత్త భవనాన్ని నిర్మిస్తామనీ, వైద్య విద్య ఫీజులను నియంత్రమిస్తామని హామీనిచ్చింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీఏ ప్యాన్ఱెల్‌ డాక్టర్లు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త భవనం నిర్మిస్తామనీ, వైద్య విద్య ఫీజుల నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారమున్న టీఎస్‌ఎంసీ గత 17 ఏండ్లుగా ప్రభుత్వంచేత నామినేట్‌ అయిన వ్యక్తుల చేతిలో నడుస్తోందని వివరించారు. దీంతో అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ప్రజారోగ్యం ఇబ్బంది పడుతోందని విమర్శించారు. దీనిపై హెచ్‌ఆర్‌డీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎన్నికలు నిర్వహించేలా కృషి చేసిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షులు డాక్టర్‌ కె.మహేశ్‌ కుమార్‌తో పాటు డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి, డాక్టర్‌ కుసుమరాజు రవి కుమార్‌, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తోటావర్‌, డాక్టర్‌ గుండగాని శ్రీనివాస్‌, డాక్టర్‌ సయ్యద్‌ ఖాజా ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ ఎ.సన్నీ డెవీస్‌, డాక్టర్‌ యెగ్గన శ్రీనివాస్‌, డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ వేములపల్లి, డాక్టర్‌ బండారి రాజ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.ఆనంద్‌, డాక్టర్‌ కున్‌ విష్ణు, డాక్టర్‌ శ్రీకాంత్‌ జూకురు పాల్గొన్నారు.
48,405 మంది ఓటర్లు….
ఎన్నికల ద్వారా రాష్ట్ర వైద్యమండలికి 13 మందిని పాలక మండలి రూపంలో ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలో 48,405 మంది డాక్టర్లు ఓటు హక్కును కలిగున్నారు. కాగా వంద మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా నిర్వహించనున్నారు. వచ్చే నెల నుంచి బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ జరగనుండగా, ఓట్ల లెక్కింపును డిసెంబర్‌ ఒకటిన చేపట్టనున్నారు.