– సకల సౌకర్యాలతో నిర్మాణం
– అందుబాటులోకి మరో 8 నెలల్లో
ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి). ఆధునిక క్రికెట్లో అగ్రశ్రేణి జట్టు టీమ్ ఇండియా. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ ఐపీఎల్. ఇలా అన్ని హంగులు బీసీసీఐ సొంతమైనా.. సకల సౌకర్యాలతో కూడిన ఎన్సీఏ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కలగానే మిగిలింది. ఐపీఎల్ నుంచి ఊహకందని డబ్బు ఆర్జిస్తున్న బీసీసీఐ.. ఇప్పుడు ఆ కల సాకారం చేయనుంది. మరో ఎనిమిది నెలల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ సెంటర్‌ను ఆవిష్కరించనుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్‌కు కేంద్రం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ). భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్సీఏను 2000లో మొదలుపెట్టింది. ముంబయి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయం తరహాలోనే.. ఎన్సీఏను సైతం చిన్నస్వామి స్టేడియంలో ఉంచింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సీఏ) నుంచి అద్దె ప్రాతిపదికన ఓ ప్రాక్టీస్ గ్రౌండ్, ఇండోర్ సౌకర్యం, జిమ్‌ను తీసుకుంది. భారత క్రికెట్లో పెద్ద డబ్బు లేని సమయంలో ఇది చెల్లింది. కానీ 2008 తర్వాత పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బీసీసీఐ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు వరదై పారింది. అయినా.. ముంబయిలో ప్రధాన కార్యాలయం, బెంగళూర్‌లో ఎన్సీఏకు శాశ్వత కట్టడాలను బోర్డు పెద్దగా పట్టించుకోలేదు. ఆధునిక క్రికెట్‌ను అన్ని కోణాల్లోనూ శాసిస్తున్న బీసీసీఐ.. క్రికెట్ సౌకర్యాల కల్పనలోనూ అగ్రగామిగా నిలిచేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ సెంటర్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. 2022 ఫిబ్రవరిలో బెంగళూర్ శివారు ప్రాంతంలో 42 ఎకరాల సువిశాల స్థలంతో నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2023 ఆగస్టు నాటికి నూతన ఎన్సీఏను అందుబాటులోకి తీసుకొస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా వెల్లడించారు.
రూ.50 కోట్లకు లీజు
జాతీయ క్రికెట్ అకాడమీని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తరహాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం తొలుత కర్ణాటక ఇండిస్టీయల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (కెఐఏడిబి) నుంచి 99 ఏండ్లకు 42 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది. కర్ణాటకలో వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు మారినా.. ఈ భూమిపై నిర్మాణాలు చేపట్టేందుకు హక్కులు బోర్డుకు దఖలు పడలేదు. చివరగా 2017లో ఆ భూమి బీసీసీఐ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు బీసీసీఐ గ్లోబల్ టెండర్లు పిలిచింది. 2022 ఫిబ్రవరిలో ఎన్సీఏ నిర్మాణానికి భూమి పూజ జరిగింది.
సకల సౌకర్యాలు
నూతన నేషనల్ క్రికెట్ అకాడమీ క్రికెట్‌కు భూతల స్వర్గం అని చెప్పవచ్చు. ఇక్కడ లేని సౌకర్యం అంటూ ఏదీ లేదు. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్‌కు సంబంధిత పరిశోధన కేంద్రాలను సైతం ఇక్కడ ప్రారంభించనున్నారు. 16000 చదరపు అడుగులతో కూడిన వ్యాయామశాల అందులో కీలకం. 40 ప్రాక్టీస్ పిచ్‌లను సిద్ధం చేస్తుండగా, అందులో 20 ప్రాక్టీస్ పిచ్‌లకు ఫ్లడ్‌లైట్ల సదుపాయం కల్పిస్తారు. భారత క్రికెటర్లు, దేశవాళీ టోర్నీల్లో వచ్చిన ఆటగాళ్లతో పాటు బీసీసీఐ ఉన్నతాధికారులు, అతిథులు బస చేసేందుకు ఎన్సీఏ ప్రాంగణంలో 243 విలాసవంతమైన గదులు నిర్మిస్తున్నారు. 5 స్టార్ హోటల్ సదుపాయాలను ఈ గదుల్లో కల్పించనున్నారు. నియంత్రిత ఉష్ణోగ్రతతో కూడిన స్విమ్మింగ్‌పూల్‌ను సైతం అందుబాటులోకి తేనున్నారు. ఇక ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇండోర్ ట్రైనింగ్ సెంటర్ ఉండనున్నాయి. ఇండోర్ ట్రైనింగ్ సెంటర్లో..ఫుట్‌బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఉంటాయి.
ఐదు జోన్లలో
నయా ఎన్సీఏను ఐదు జోన్లుగా విభజించారు. ఇక్కడ కల్పించనున్న సదుపాయాలను బీసీసీఐ రెండు దశల్లో ఏర్పాటు చేయనుంది. కామన్ ఫెసిలిటీస్‌ను రెండో విడతలో అందుబాటులోకి తీసుకు రానున్నారు. తొలి విడతగా.. ఓ ప్రధాన గ్రౌండ్, ఎన్సీఏకు సంబంధించిన పరిపాలన భవనం, పెవిలియన్ బ్లాక్, రెండు ప్రాక్టీస్ మైదానాలు ఉన్నాయి. ఇవి జోన్-1లో ఉంటాయి. ఇక జోన్-2లో అవుట్డోర్ ట్రైనింగ్ సెంటర్.. ఇందులో 40 ప్రాక్టీస్ పిచ్‌లు, మల్లీపర్సస్ ఫీల్డింగ్ ఏరియా, స్మిమ్మింగ్‌పూల్, సమావేశపు గదులు వంటివి ఉన్నాయి. జోన్-3లో 16000 చదరపు అడుగుల జిమ్ ఉంటుంది. ఒక ఎకరా స్థలంలో అవుట్డోర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్టు తయారు చేసిన పిచ్‌లు జోన్-3లో ప్రత్యేకం. ఇక జోన్-4లో రెసిడెన్షియల్ బ్లాక్ ఉంటుంది. తొలి దశలో సెంట్రల్ కిచెన్, బాంకెట్ హాల్, బస చేసేందుకు 30 విభిన్న గదులను నిర్మించనున్నారు. రెండో విడతలో మిగతా రెసిడెన్షియల్ గదులను నిర్మిస్తారు. జోన్-2లో 20 ప్రాక్టీస్ పిచ్‌లకు ఫ్లడ్‌లైట్లు, రెండు టెన్నిస్ కోర్టులు సైతం రెండో విడతలోనే అందుబాటులోకి వస్తాయి. ఓవరాల్‌గా అన్ని జోన్లకు అందుబాటులో.. చిన్నపిల్లల కేరింగ్ సెంటర్, 7,500 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ప్రధాన గ్రౌండ్లో గ్యాలరీ, ఫార్మాసీ, క్షౌరశాల, సైక్లింగ్ ట్రాక్, ఐస్‌క్రీమ్, జ్యూస్ పార్లర్, ఫ్యూయల్ బంక్, స్టేషనరీ షాప్ వంటివి సైతం ఎన్సీఏలో భాగంగా నిర్మిస్తున్నారు.
విజేతల కార్ఖానా
ఎన్సీఏ చాంపియన్ల కార్ణానాగా వెలుగొందాలని బీసీసీఐ ప్రణాళిక. జాతీయ క్రికెటర్లకు ఇక నుంచి ఇక్కడే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనుండగా.. దేశవాళీ, జూనియర్ క్రికెటర్లను ఇక్కడ సాన పట్టనున్నారు. అండర్-19 క్రికెటర్లు ఇక్కడే ఎన్సీఏ శిక్షకుల వద్ద తర్ఫీదు పొందాల్సి ఉంటుంది. జాతీయ జట్టుకు క్రికెటర్లను అందించేందుకు ఎన్సీఏ ఇక నుంచి వారధిగా వ్యవహరించనుంది. జాతీయ జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీలు ఎన్సీఏతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలను నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించనుంది. భారత క్రికెట్‌ను ప్రపంచ నం.1గా నిలిపేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించే బాధ్యత తీసుకోనుంది.