కొత్త సంవత్సరానికి కొత్త నిర్ణయాలు

కొత్త సంవత్సరానికి కొత్త నిర్ణయాలుమరో వారంరోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. మీరు మీ కొత్త సంవత్సర నిర్ణయాలేమిటి? లక్ష్యాలేమిటి? మునుపటి కన్నా భిన్నంగా ఈ ఏడాది ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోనున్నారు. నిర్ణయాల్ని తీసుకోవడమే కాదు, వాటికి బద్ధులయి ఉండటం అవసరం. ఆ నిబద్ధత, అంకితభావం మీలో ఎంత ఉన్నదో మీకుగా మీరు నిర్ణయించుకోవాలి. ఒకసారి నిర్ణయాలు తీసుకుంటే వాటికి కట్టుబడి ఉండాలి. మీరు ఎవరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ మీకు మీరే జవాబుదారీ. మీ అంతరంగమే మీ నిర్ణయాలకు సాక్షి. కనుక మీ నిర్ణయాల్ని మీరు ఉల్లంఘిస్తే అంతరాత్మ ఘోషిస్తుంది. కనుక ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు మీకోసం మీరు తీసుకుంటున్నారా? లేదా ఏ ఫ్రెండ్‌ కోసమో, మరెవరి నుంచి ఏదో ఆశించి తీసుకుంటున్నారా? ఇందులో మీకు స్పష్టత అవసరం. ఉదాహరణకు మీ గర్ల్‌ఫ్రెండ్‌ కోసమని మీరు గిటార్‌ నేర్చుకోడం మొదలెట్టడం అర్థంలేని పని. అందులో లీనం కాలేక మీరు విఫలమవుతారు. కనుక ఏదైనా మీకోసం మీరు ఆలోచించి నిర్ణయించుకోడం మంచిది.
ఒక నిర్ణయం తీసుకునే ముందుగానే దానిని అమలు చేయడంలో వచ్చే ఇబ్బందుల్ని, అడ్డంకుల్ని తొలుతనే ఊహించాలి. ఉదాహరణకు మీరు బరువు తగ్గాలి అని కచ్చితంగా నిర్ణయించుకుంటే దానికోసం ఏం చేయాలో ఆలోచించాలి. దీనిని ఎలా అమలు చేయాలో ప్లాన్‌ చేసుకోవాలి. డైటీషియన్‌ని కలిసి మీ డైట్‌లో రావాల్సిన మార్పుల గురించి ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే జిమ్‌ లేదా యోగా చేయాలనుకుంటే అందుకు తగ్గ సమయ సందర్భాలు నిర్ణయించుకోవాలి. బరువు తగ్గడానికి వున్న అన్నిరకాల ఆప్షన్స్‌ని స్టడీ చేసి అమలు చేయాలి. మీ నిర్ణయం అంతిమంగా మీకు సానుకూల ఫలితాల్ని ఇచ్చేలా ఆచరణ ఉండాలి.
ఇతరుల ప్రభావాలకు అతీతంగా మీకుగా మీరు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకోగానే సరిపోదు. వాటిని అమలు చేయాలి. అందుకు అనుగుణంగా నిర్దిష్టమైన ప్రణాళికను కూడా ముందే రచించుకోవాలి. మద్యం మానేయాలి, సిగిరెట్లు వదిలేయాలి వంటి నిర్ణయాలు తీసుకోడం సులువే. కాని వాటిని కచ్చితంగా అమలు చేయడానికి మానసిక సంసిద్ధత, దృఢ సంకల్పం మీలో ఉండాలి.
మీ నిర్ణయం ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందే చూసుకోవాలి. ఉదాహరణకు మీరు ఖర్చులు తగ్గించి, పొదుపు ఎక్కువగా చేయాలని నిర్ణయించుకుంటే తగినవిధంగా ప్లాన్‌ చేసుకోవాలి. పిల్లలకీ, బంధుమిత్రులకీ ఇబ్బంది కలగనిరీతిన ప్లాన్‌ చేయడం ఉత్తమం.
2024లో ప్రత్యేకించి నిర్దిష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమిటో మీకు స్పష్టత ఉండాలి. ఆ నిర్ణయం మీలో తీవ్రమైన మార్పును తీసుకురానుందా? ఆ మార్పునకు మీరు సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాలి. మీరు తీసుకోబోయే నిర్ణయాల సానుకూలతలు, ప్రతికూలతలు మొదటనే ఆలోచించాలి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి.