కొత్త సంవత్సరపు ‘కొత్త సిలబస్‌’

New Year's 'New Syllabus'కొత్తసంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కాలంతో పాటు ఉత్సవాన్ని జరుపుకునే విధానాలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పండుగకే మాంసాహారాన్ని భుజించడం, చుట్టాల పేరుచెప్పుకుని కోడిని కోయడం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పండుగంటే ఓహొ ప్రత్యేకత. పండుగకే వరి అన్నం తినేవాళ్ళు. ఇప్పుడంతా రివర్స్‌ నడుస్తుంది. చీమ చిటుక్కుమన్నా పార్టీ చేసే కాలమది. ఎవరిని తప్పు పట్టేది కాదు. ప్రపంచీకరణ, ఆధునికత వేళ్ళూనుకొని పోతున్న సందర్భమిది. ప్రాచ్యమంతా పాశ్చాత్యం వైపుహొ అడుగులు వేస్తున్న కాలం. కాలంతో పాటు పయనిస్తూ కొంత వివేచనను కలిగివుండటం నేటి మనిషి చేయాల్సిన పని. కొత్తకు స్వాగతం పలకటం, పాతను మరిచిపోవటం మంచిదే. లోపలి మనిషిని మాత్రం కాపాడుకోవాలి.
కవులు చాలామంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవితలు రాశారు. కొత్త సంవత్సరం పట్ల భావుకతతో రాసినవారు ఉన్నారు. తాత్వికకోణంలో రాసినవారు ఉన్నారు. ప్రేరణాత్మక కోణంలో రాసినవారు ఉన్నారు.
అందులోంచి ‘కొత్తబాట’ పేరుతో చైతన్యాన్ని రగిలిస్తున్న డా||ఎస్‌.రఘు కవిత ఈనాటి వర్తమాన కవిత్వంలో భాగమయింది. వారు ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘జీవనలిపి’ పేరుతో నానీల పుస్తకం వేశారు. ‘సమన్వయ’ పేరుతో విమర్శా వ్యాసాల పుస్తకాన్ని వెలువరించారు.
శీర్షిక కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నది. చైతన్యబావుటాను ఎగరేస్తున్నది. బాటను ఎరుకజేస్తున్నది.
ఎత్తుగడలో జీవితానికి సంబంధించిన వాస్తవికత కనిపిస్తుంది. ఎన్ని వసంతాలు మారినా సూర్యుడు మారడు. గోడ మీది క్యాలెండర్స్‌ మారుతాయి అనటంలో లోతైన తాత్వికత ఉంది. సంతోషాన్నయినా, బాధనయినా ఏ మేరకు తీసుకోవాలి అనే స్పహ కలిగించేలా నిగూఢమయిన జీవనరహస్యం దాగియుంది. ఈ కవిత వాక్యాలు జీవితం పట్ల ఓ స్పష్టమైన అవగాహనను కలిగిస్తాయి.
రెండవ స్టాంజాలో మనిషి ఆయా పరిస్థితుల్లో ఎలా ఉంటాడు? మనిషి జీవనవిధానాన్ని రాజకీయాలు ఎంతలా ప్రభావితం చేస్తాయి? మనిషి స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కవి చెప్పినట్టు నిజంగా మనిషి మారడా? అంటే ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా మనిషి కొత్త దుస్తులు ధరిస్తడేమో కానీ పేదరికపు మచ్చలు కనబడకుండా పోవు కదా! మధ్యతరగతి జీవితాలు రాత్రికి రాత్రే మారవు కదా! అలాంటి సందర్భాన్ని చిత్రించి మనిషికి కనువిప్పు కలిగిస్తున్నాడు.
మూడు, నాలుగు స్టాంజాల్లో కవితా తీవ్రత తారాస్థాయికి చేరుకుంది. జీవితమన్నాక సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ, నిరాశలు ఉంటాయి అంటూ జీవిత నాణానికి బొమ్మాబొరుసులయినా వాటి ప్రభావం సంవత్సరాలను బట్టి మారవని, మనుషులు ఈ నాలుగు రోడ్ల రంగస్థలానికొచ్చి వారి పాత్ర పోషించి ఎళ్ళిపోవాల్సిందేనని జీవిత సత్యాన్ని సుతిమెత్తగా అర్థం చేయించాడు.
తరువాతి స్టాంజాల్లో మానవ సంబంధాలు మనిషి జీవితంలోకి ఎలా తొంగి చూస్తాయి. మనిషికి సాటి మనిషితోని ఉన్న అవసరం ఎలాంటిది? అని తెలియజేస్తూ మనుషుల మధ్య ఉండే అడ్డుగోడలను తొలగించుకోమంటున్నాడు. స్నేహపరిమళపు గొప్పతనాన్ని విప్పి చెబుతున్నాడు. ”ఆత్మీయ స్నేహ సంబంధాలే బతుకు ఖాళీలలో వసంతాల్ని పూయిస్తాయి” అంటూ వసంతమంటే ఒక్కరోజు కేకులు కట్‌ చేస్తేనో, ఒక్క రోజు రంగు ముగ్గులతోనో నిండేది కాదు. జీవితాంతం తోడుండే స్నేహం లాంటిదని నిర్వచిస్తున్నాడు. కాలంతో పాటు మారుతున్న మనుషులున్న ఈ కాలాన మాటలు కరువయి పోకుండా చూసుకోవాలని అప్పుడే జీవితానికో సార్థకత ఉంటదని, కొత్త సంవత్సరం అంటే మనుషులు యంత్రంలా మారటం కాదని హితవు పలికాడు. ప్రతి మనిషి చదవదగ్గ ఓ జీవన గ్రంథాన్ని లిఖించుకోవాలని ఈ కవి సూచిస్తున్నాడు.
ముగింపులో అందరిని ఆశ్చర్యపరుస్తూ అనుభవైక నేపథ్యంలో నుంచి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపటమనేది ఎప్పుడూ ఉండే పాత మాటేనని, అందరూ ఎప్పటికప్పుడు తమను తాము అభివద్ధి పథంలోకి నడిపించుకుంటూ, ఎలాంటి సవాళ్ళనయిన ఎదుర్కుంటూ జీవితంలో ముందడుగు వేయాలని అప్పుడే అది నవవసంతాన్ని తీసుకొస్తుందని కొత్త సంవత్సరపు తాలూకా కొత్త సిలబస్‌ ను పరిచయం చేశాడు. నిత్యచైతన్యాన్ని రగిలిస్తున్న ఈ కవిత నేటి కాలానికి దర్పణం పట్టేది అనటంలో అతిశయోక్తి లేదు.

– డా||తండా హరీష్‌ గౌడ్‌
8978439551
కొత్త బాట
గోడ మీద
క్యాలెండర్‌ మారినట్లు
ఆకాశంలో సూర్యుడు మారడు.

ఐదేళ్లకోసారి
నాయకులు మారినట్లు
నేలమీద ప్రజలు మారరు

ప్రతి సంవత్సరం
పండుగలు వచ్చిపోయినట్లు
సుఖదుఃఖాలు పలకరిస్తాయి
ప్రతిరోజూ వెలుగుచీకట్లు అలుముకున్నట్లే
ఆశ నిరాశలు ముసిరిపోతుంటాయి.

ఈలోకం
నాలుగు రోడ్ల కూడలి
వాహనాలు వచ్చిపోయినట్లే
మనుషులు వచ్చి ఎటో వెళ్లి పోతుంటారు

మనసు కిటికీలు
మూసుకున్నా
అనుభూతుల ద్వారాల్ని తెరిచేది
స్నేహితులే!
గోడల మధ్య కూర్చున్నా
అడ్డుగోడలు లేనివి మానవ
అనుబంధాలే.
ఆత్మీయ స్నేహ సంబంధాలే
బతుకు ఖాళీల్లో
వసంతాల్ని పూయిస్తాయి!

కాలచక్రం చుట్టూ మర మనుషుల్లా
తిరుగాడే
మనమధ్య విరబూసిన మాటల
జ్ఞాపకాలే
జీవన గ్రంథానికి పరిమళాల్ని అద్దుతాయి

కొత్త సంవత్సరానికి స్వాగతం
పాతమాట!
నిత్యచైతన్యానికి పునరంకితం
కొత్త బాట!!
– డా||ఎస్‌.రఘు