నిమ్స్‌ అరుదైన రికార్డు

Nims is a rare record– అత్యధిక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌
– 8 నెలల్లో 100 కిడ్నీ మార్పిడిల ఆపరేషన్‌లు
– మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ప్రశంసలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
చరిత్రలో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న నిమ్స్‌ హాస్పిటల్‌ మరో మైలురాయికి చేరింది. అరుదైన రికార్డుతో వైద్య రంగంలోనే సంచలనం సృష్టించింది. 8 నెలల వ్యవధిలోనే 100 కిడ్నీ మార్పిడీలు చేసి ఔరా అనిపించారు యూరాలజీ వైద్యులు. ఈ కిడ్నీ మార్పిడీలలో 61 లైవ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌, 39 దాతల ద్వారా సేకరించినవి ఉన్నాయి. గ్రహీతల్లో 11, 12 ఏండ్ల వయస్సు వారు కూడా ఉన్నారు. నెల రోజుల్లోనే రోబోటిక్స్‌ సాయంతో యూరాలజీ, సర్జికల్‌ అంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంకిష్టమైన 30 ఆపరేషన్లను కూడా పూర్తి చేశారు. యూరాలజీ విభాగాధిపతి రాహుల్‌ దేవరాజ్‌ సారథ్యంలో ఈ కిడ్నీ మార్పిడీలు చేస్తున్నారు. యూరాలజీ విభాగం వైద్యులు కిడ్నీ మార్పిడిలతోపాటు అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు, సాధారణ చికిత్సలు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిమ్స్‌ ఆస్పత్రి అవయవ మార్పిడిలతో ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది. జీవన్‌దాన్‌ ద్వారా పేదలకు అతి తక్కువ సమయంలోనే అవయవాలు అందేలా వైద్యులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రోగులకు ఎలాంటి వైద్య ఖర్చుల్లేకుండా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప సారథ్యంలో అవయవ మార్పిడి చికిత్సలు వేగంగా పూర్తవుతున్నాయి. అవయవ మార్పిడిలు విజయవంతంగా పూర్తి చేసి రికార్డు బ్రేక్‌ చేసిన యూరాలజీ వైద్య బృందంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం 100వ కిడ్నీ మార్పిడి విజయవంతం చేసిన వైద్య బృందంలో.. యూరాలజీ విభాగాధిపతి రాహుల్‌ దేవరాజ్‌, ప్రొఫెసర్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ రామచంద్రయ్య, డాక్టర్‌ చరణ్‌కుమార్‌, డాక్టర్‌ ధీరజ్‌, డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ అరుణ్‌, డాక్టర్‌ విష్ణు, డాక్టర్‌ జానకి, డాక్టర్‌ హర్ష, డాక్టర్‌ పూవర్సన్‌, డాక్టర్‌ సూరజ్‌ కుమార్‌, డాక్టర్‌ షారుక్‌, డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ అభిషేక్‌, డాక్టర్‌ అనుపమ, డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ మధుసూదన్‌ ఉన్నారు. ఇక అనస్థీషియా విభాగం నుంచి విభాగాధిపతి నిర్మల, ప్రొఫెసర్‌ ఇందిరా, ప్రొఫెసర్‌ అన్నె కిరణ్‌, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ శిబాని, నెఫ్రాలజీ విభాగం నుంచి ప్రొఫెసర్‌ గంగాధర్‌, ప్రొఫెసర్‌ శ్రీ భూషణ్‌ రాజు, ప్రొఫెసర్‌ స్వర్ణలత ఉన్నారు.