పాలమూరు-రంగారెడ్డిపై విపక్షాలది దుష్ప్రచారం: నిరంజన్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును జూరాల నుంచి మొదలు పెట్టాలని మొదట విపక్షాలు వాదించాయనీ, అటవీప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఫిర్యాదు చేశాయని గుర్తు చేశారు. ‘విపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. చివరికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో సైతం ఫిర్యాదు చేశాయి. అన్ని అడ్డంకులను దాటుకుని ప్రాజెక్టు ప్రారంభించాం. ప్రాజెక్టు రీడిజైన్‌తో ముంపు ప్రాంతాల పరిధి తగ్గింది. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా కేసీఆర్‌ దృష్టి పెట్టారు’ అని పేర్కొన్నారు. జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85వేల ఎకరాల సేకరణ ఉందని వివరించారు. రీడిజైన్‌ చేసిన పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27వేల ఎకరాల భూసేకరణ, మూడు పెద్ద గ్రామాలు, 8 చిన్న తండాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఉందని తెలిపారు. కృష్టానదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్‌లోనేనని వివరించారు సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీర్లతో మోటార్ల బిగించాయని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించడం గమనార్హమని పేర్కొన్నారు.