– మాకు ఆయన అవసరం లేదు
– మోడీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది
– వారి భూముల్ని పారిశ్రామికవేత్తలకు
– కట్టబెట్టింది బీహార్ యాత్రలో రాహుల్
పాట్నా : ఇండియా కూటమి నుండి వైదొలిగి బీజేపీతో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒత్తిడి కారణంగానే ఆయన ఇండియా కూటమి నుండి వెళ్లిపోయారని, ఆయన అవసరం తమకు లేదని అన్నారు. భారత్ జోడో న్యారు యాత్రలో భాగంగా బీహార్‌లోని పుర్నియా జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ నితీష్‌పై చలోక్తులు విసిరారు. ప్రమాణస్వీకారం అనంతరం తన శాలువాను తీసుకునేందుకు నితీష్ మళ్లీ రాజ్‌భవన్‌కు వెళ్లారంటూ జోక్ చేశారు. దశాబ్ద కాలంలో నితీష్ ఐదుసార్లు విధేయతలు మార్చుకున్నారని గుర్తు చేస్తూ ‘నితీష్ రావడం చూసి గవర్నర్ ఆశ్చర్యపడ్డారు. మళ్లీ రాజ్‌భవన్‌కు ఎందుకొచ్చారని ఆయన్ని ప్రశ్నించారు’ అని వ్యంగ్యంగా అన్నారు.
బీహార్‌లో మహా కూటమి సామాజిక న్యాయం కోసం పోరాడుతుందని రాహుల్ చెప్పారు. ఈ విషయంలో తమకు నితీష్ అవసరం లేదని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కూడా రాహుల్ నిప్పులు చెరిగారు. 2020లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులను చీకటి చట్టాలుగా వర్ణించారు. రైతుల నుండి భూములు లాక్కొని అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను ప్రతిఘటించి అలుపెరుగని పోరాటం చేసిన అన్నదాతలను అభినందించారు. దేశంలో కులగణన ఆవశ్యకతను రాహుల్ నొక్కి చెప్పారు. ‘మన సమాజంలో వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నారు. ఓబీసీల జనాభా అధికంగా ఉంది. అయితే ఓబీసీలు ఎంత మంది ఉన్నారని నేను ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం లేదు’ అని అన్నారు. రైతులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ అన్నదాతల భూమిని పరిరక్షించే విషయంపై రాజకీయ నాయకులు మాట్లాడితే వారిపై మీడియా రాత్రింబవళ్లూ దాడి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఈ అంశాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తగలనని, అయితే ప్రధాని ఏమైనా చేస్తారని మాత్రం గ్యారంటీ ఇవ్వలేనని అన్నారు. ఎరువులు, విత్తనాలు పొందడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కోటీశ్వరులకు చెందిన 14 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను రద్దు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 72 వేల కోట్ల రూపాయల మేర రైతు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించామని రాహుల్ గుర్తు చేశారు.