బల పరీక్ష నెగ్గిన నితీశ్‌ సర్కార్‌

బల పరీక్ష నెగ్గిన నితీశ్‌ సర్కార్‌పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీంతో విశ్వాస పరీక్ష సమయంలో ప్రతిపక్షం ‘అంకెల గారడీ’ కి ప్రయత్నిస్తుందంటూ కొన్ని రోజుల నుంచి వెలువడుతున్న ఊహాగానాలు పటాపంచలయ్యాయి.
మెజారిటీ ఓటుతో ప్రభుత్వం నెగ్గిందని జనతాదళ్‌ (యునైటెడ్‌) కి చెందిన డిప్యూటీ స్పీకర్‌ మహేశ్వర్‌ హజారి సభలో ప్రకటించారు. 243 మంది సభ్యులు గల సభలో మహాఘట్‌బంధన్‌ సభ్యులందరూ వాకౌట్‌ చేయడంతో జేడీయూ-బీజేపీ కూటమికి అనుకూలంగా తుది స్కోర్‌ 129-0గా మారింది. జేడీయూకి 45మంది ఎంఎల్‌ఎలు వుండగా, బీజేపీకి 79, హెచ్‌ఎఎంఎకి నలుగురు వున్నారు. అంటే మొత్తం 128మంది వున్నారు. ముగ్గురు ఆర్జేడీ ఎంఎల్‌ఎలు పాలక ఎన్డీఏ వైపునకు ఫిరాయించి, అనుకూలంగా ఓటు వేసినట్లు వార్తలందాయి. జేడీయూకి చెందిన ఒక ఎంఎల్‌ఎ బలపరీక్షకు గైర్హాజరయ్యారు. మరో ఎంఎల్‌ఎ హజారి డిప్యూటీ స్పీకర్‌గా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందున ఆయన ఓటు వేయలేరు. అందువల్ల ఎన్డీఏకి 126మందే సభ్యులు వున్నారు. ముగ్గురు ఆర్జేడీ సభ్యులు కూడా ఓటు వేయడంతో 129మంది మద్దతిచ్చినట్లైంది.
భారతరత్న అవార్డులపై ఒప్పందం కుదుర్చుకున్నారు : తేజస్వి యాదవ్‌
భారతరత్న అవార్డులపై బీజేపీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన విధాన సభలో మాట్లాడుతూ.. ‘కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే బీజేపీ వాళ్లు మాతో ఒప్పందం కుదుర్చుకుంటే.. మీకు భారతరత్న అవార్డును ఇస్తాం అనే విధంగా వారు ఒప్పందం కుదుర్చుకున్నారు.’ అని తేజస్వియాదవ్‌ విమర్శించారు.