– మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డెంటల్ సర్జన్ మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు డాక్టర్ వైఎస్సాఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్యాయం చేసిందని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ మంజూర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు ఒక వినతిపత్రం సమర్పించారు. బీ కేటగిరీ భర్తీని నీట్ పీజీ (ఎండీఎస్ 2023) ర్యాంకుల ప్రకారం భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చిన సదరు యూనివర్సిటీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల తుది మెరిట్ జాబితాలో ఉస్మానియా విద్యార్థులు మాత్రమే ఎస్1ఏ కేటగిరీకి అర్హులని తెలిపినట్టు గుర్తు చేశారు. అయితే ఆ కేటగిరీలో సీట్లు లేవని తిరిగి ప్రకటిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయించినట్టు తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ర్యాంకులు, ప్రతిభ ఆధారంగా కాకుండా తెలంగాణ విద్యార్థులను పక్కన పెడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.