ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌

– పాలకుర్తిలో రూ.160 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన
నవతెలంగాణ-జనగామ
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హాట్రిక్‌ మాత్రం బీఆర్‌ఎస్‌దేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వెల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల స్వామి దేవాలయ పున:ప్రతిష్ఠతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధిక సీట్లతో అధికారంలోకి వచ్చి హాట్రిక్‌ కొడుతుందన్నారు. కేసీఆర్‌ ఆశీస్సులతో పాలకుర్తిని అభివృద్ధి చేసిన ఘనత దయాకర్‌ రావుదేనని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రజలకు మట్టి అంటకుండా మంత్రి దయాకర్‌ రావు సీసీ రోడ్లు వేయించారన్నారు. మంత్రి ఎర్రబెల్లి కోరిక మేరకు పాలకుర్తిలో 50 పడకల ఆస్పత్రిని త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 24 గంటలు ఇస్తున్న కరెంటు వేరే ప్రభుత్వం వస్తే వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఓటమి భయంతో జెమిలి పద్ధతి తెరమీదికి తీసుకు వస్తుందన్నారు. దక్షిణ భారతదేశంపై బీజేపీ చూస్తున్న చిన్న చూపునకు ఈ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాకుండా దేశంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. కర్నాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో బీజేపీ పూర్తిగా వాష్‌ అవుట్‌ అవుతుందని చెప్పారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.