– అదనంగా ఓఎంఆర్ పత్రాలు కలిసే అవకాశం లేదు
– టీఎస్‌పీఎస్సీ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. అదనంగా ఓఎంఆర్ పత్రాలు కలిసే అవకాశం లేదని తెలిపింది. బయోమెట్రిక్ విధానం పాటించలేదనీ, పరీక్షను సరిగ్గా నిర్వహించలేదని గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్నేండ్లుగా నియామకాల కోసం పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపింది. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించామని పేర్కొంది. కలెక్టర్లు, ఇతర అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు తొలుత 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రకటించామని వివరించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియ మొదలయ్యాక 2,33,506 మంది హాజరయ్యారని వివరాలొచ్చాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 994 పరీక్షా కేంద్రాల్లో జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించామని పేర్కొంది. జిల్లాల్లోని కేంద్రాల్లో లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపింది. స్వల్ప సమస్యలు తలెత్తాయని వివరించింది. లేదంటే అభ్యర్థుల హాజరుకు సంబంధించి ప్రాథమిక సమాచారంలోని వివరాలకు, స్కానింగ్‌లో తుది వివరాలకు మధ్య కొంత తేడా ఉందని తెలిపింది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అదనంగా ఓఎంఆర్ పత్రాలు కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పు జరగలేదని వివరించింది.