స్వతంత్ర పరిశీలకుడు అక్కర్లేదు

– బెంగాల్‌ ఎన్నికలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతిపాదనకు హైకోర్టు తిరస్కరణ
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు స్వతంత్ర పరిశీలకుడిని నియమించాలన్న ప్రతిపాదనను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ విచారణపై ఆదేశాలను రిజర్వ్‌ చేసింది. జులై 8న పశ్చిమబెంగాల్‌లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర పరిశీలకుడిని నియమించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దశలోనే బెంగాల్‌లో తృణమూల్‌ గూండాలు పలుచోట్ల హింసాకాండకు పాల్పడటంతో ఈ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. కమిషన్‌కి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ (విచారణ) దామోదర్‌ సారంగియాస్‌ను పరిశీలకుడిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్‌ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (డబ్ల్యుబిఎస్‌ఇసి) హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి స్వతంత్ర పరిశీలకుడిని నియమించే హక్కు, సున్నితమైన ప్రాంతాలను గుర్తించే హక్కు లేదని పేర్కొంది.