– పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల డిమాండ్
– వాహనాలకు వాయిదాలు, ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నాం..
– తమ భార్యల పుస్తెలను సైతం తాకట్టుపెట్టాం : జీహెచ్‌ఎంసీ ముందు కాంట్రాక్టర్ల ధర్నా
నవతెలంగాణ- సిటీబ్యూరో
”పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే.. పనులు చేస్తాం.. రూ.1000కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి.. వాహనాలకు బ్యాంకు వాయిదాలు కట్టే పరిస్థితి లేదు.. మా భార్యల పుస్తెలను సైతం తాకట్టుపెట్టాల్సిన దుస్థితిలో ఉన్నాం” అంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం కాంట్రాక్టర్లు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఎంట్రెన్స్ వైపున్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫీసు వద్ద బైటాయించారు. నో పేమెంట్.. నో వర్క్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత కాంట్రాక్టర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, కాంట్రాక్టర్లు ఆందోళన కొనసాగించారు. దాదాపు గంటన్నర సేపు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్న క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్లను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమనెందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ తమ బిల్లులన్నీ చెల్లించే వరకు ఎలాంటి పనులూ చేపట్టబోమని తేల్చి చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30సర్కిళ్లు, ఆరు జోన్ల పరిధిలో దాదాపు ఐదు వేలమంది చిన్నాపెద్దా కాంట్రాక్టర్లున్నారని తెలిపారు. సీసీ, బీటీ రోడ్ల పనులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులతోపాటు, నాలా మరమ్మతులు, అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఆధారపడి ఐదు వేల మందికిపై కార్మికులు కుటుంబసభ్యులతో కలిపి దాదాపు రెండు లక్షల మంది జీవిస్తున్నారన్నారు. ఏడాదికాలంగా జీహెచ్‌ఎంసీ అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని తెలిపారు. తమ భార్యల పుస్తెల తాళ్లను సైతం తాకట్టుపెట్టామని, వాహనాల వాయిదాలు, ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత మే మాసం చివరికల్లా సుమారు రూ.800 కోట్లవరకున్న బిల్లులు జులై చివరికల్లా వెయ్యి కోట్లు దాటాయని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు హనుమంత్ సాగర్, సురేందర్ సింగ్ వెల్లడించారు. రూ.800 కోట్ల బకాయిలున్నపుడే కనీసం సగం బిల్లులైనా చెల్లించాలని తాము కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
బడాబాబులకు సంబంధించిన ఏజెన్సీలున్న సీఆర్‌ఎంపీకి ఒక్క నెల బిల్లు కూడా ఆపకుండా చెల్లిస్తున్న అధికారులు.. తమ బిల్లులు చెల్లించేందుకు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే బిల్లులు చెల్లించడం లేదన్నారు. కాంట్రాక్టర్లలో నూటికి తొంభై మంది మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారని, అప్పులు తీసుకొచ్చి, కుటుంబ సభ్యుల ఆభరణాలు కుదవ పెట్టి కార్మికులకు కూలి డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పారు. బిల్లుల చెల్లింపులో అధికారుల అలసత్వానికి గతంలో కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.