పేదలపై పోలీసుల జులుం వద్దు…

– అధైర్యపడొద్దు..
– అండగా ఉంటాం..
– పట్టాలిచ్చే వరకు మీ వెంటే ఉంటాం.. : గుడిసెవాసులతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – నర్సంపేట
నిల్వ నీడలేని పేదలపై పోలీసులు జులం ప్రదర్శించడం మానేసి చట్టాన్ని గౌరవించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం వరలంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణం కాకతీయ నగర్‌లోని సర్వే నెంబర్‌ 601/1/1లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేసిన గుడిసెలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. పోలీసులు భూకబ్జాదారులతో కలిసి వచ్చి ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేదలు ఏకరువు పెట్టారు. ‘అధైర్యపడొద్దు..అండగా ఉంటామని, ప్రభుత్వం పట్టాలిచ్చే వరకు మీ వెంటనే ఉంటామంటూ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గుడిసెవాసులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించి పట్టాలివ్వాలని ఇటీవల మండలి సమావేశాల్లో ప్రస్తావించానని గుర్తు చేశారు. ఇండ్ల స్థలాల కోసం పేదలు చేపట్టిన పోరాటం న్యాయమైనదని, నిల్వ నీడ లేకనే కష్టమైనా 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకొని ఇక్కట్ల పాలవుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ ఆక్రమించుకొన్న వారి జోలికి పోకుండా పోలీసులు పేదలపై తమ జులం ప్రదర్శించడం సరైందికాదన్నారు. పోలీసులు క్రిమినల్‌ కేసులు ఉన్న నేరస్తుల వద్దకు వెళ్లాలే తప్పా ఇలా పేదల గుడిసెలను ఖాళీ చేయించడానికి వారికి ఎలాంటి అధికారాలు ఉన్నాయని ప్రశ్నించారు. చట్టం పట్ల పోలీసులకు ఏమాత్రం గౌరవం ఉన్నా పేదల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీని ప్రభుత్వ అమలు చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరాటాల్లో పాలుపంచుకొంటూ ఇండ్ల స్థలాల పట్టాలను సాధించుకోవాలని సూచించారు. సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలోని సర్వే నెంబర్‌ 601లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేదలపై కొందమంది భూకబ్జాదారులతో చేతులు కలిపిన పోలీసులు.. వారిని ఇండ్ల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములపై పేదలకు మాత్రమే హక్కు ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల గుడిసె పోరాటాలకు ప్రభుత్వం తలవంచి జీవో 58,59 కింద పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. పేదలు వేసుకున్న గుడిసెలు కాపాడేందుకు మరిన్ని పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు నమిండ్ల స్వామి, గుజ్జుల ఉమ, తదితరులు పాల్గొన్నారు.