18 నెలలుగా జీతం లేదు

– చంద్రయాన్‌-3లో భాగమైన హెచ్‌ఈసీ సిబ్బంది దుస్థితి
– నేడు ఢిల్లీలో నిరసనలకు యత్నం
– పాల్గొననున్న వంద మందికి పైగా ఉద్యోగులు
– ఇప్పటికే దేశ రాజధానికి పయనం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 విజయం కోట్లాది భారతీయుల్ని గర్వించేలా చేసింది. ప్రపంచంలో భారత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలకు బీజం వేసింది. కానీ, ఈ ప్రాజెక్టులో భాగమైన జార్ఖండ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ)కి చెందిన ఉద్యోగులు, సిబ్బంది మాత్రం జీతాలకు నోచుకోలేకపోతున్నారు. 18 నెలలకు పైగా వారికి వేతనాలు అందటంలేదు. దీంతో వారు ఆందోళన బాటపడుతున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు సిద్ధమయ్యారు. హెచ్‌ఈసీకి చెందిన ఇంజినీర్‌లతో సహా 100 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొననున్నారు.
చంద్రయాన్‌-3 కటౌట్లతో రాజధానికి
నిరసనలో ప్రదర్శించేందుకు వారు చంద్రయాన్‌-3 కటౌట్‌ ప్రతిరూపాలతో ఢిల్లీకి బయలుదేరారు. ”మేము వేర్వేరు రైళ్లలో ఢిల్లీకి బయలుదేరాము. నేడు(సెప్టెంబర్‌ 21న) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ రోడ్డులో ప్రదర్శన నిర్వహిస్తాం. మేము ప్రజలకు చూపించడానికి చంద్రయాన్‌-3 కటౌట్‌ ప్రతిరూపాలను కూడా తీసుకువెళుతున్నాము. ఇస్రో ఇటీవల చంద్రుని అన్వేషణ మిషన్‌కు మా సహకారం గురించి కేంద్రానికి గుర్తు చేస్తున్నా ము. మాకు 18 నెలలుగా జీతాలు చెల్లించ లేదు” అని మంగళవారం రాంచీ నుంచి రైలు ఎక్కిన హెచ్‌ఈసీ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు భవన్‌ సింగ్‌ అన్నారు. చంద్రయాన్‌-3 కోసం ఉపయోగి ంచిన ఇస్రో రెండో లాంచింగ్‌ ప్యాడ్‌లోని అనేక భాగాల ను తాము నిర్మించామని హెచ్‌ఈసీ కార్మికు లు,ఇంజనీర్లు వివరించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు తమ ఆందోళనకు సంఘీ భా వం తెలిపారనీ, జంతర్‌ మంతర్‌ రోడ్డుపై జరిగే ధర్నాకు హాజరవుతారని భవన్‌ సింగ్‌ తెలిపారు.
ప్రధాని మోడీకి లేఖ
జీతాలు చెల్లించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న 2,800 మంది ఉద్యోగుల దుస్థితిని ఎత్తిచూపుతూ సీపీఐ(ఎం) ఎంపీ ఈ నెల ప్రారంభంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండేకు లేఖ రాశారనీ, వారు ధర్నాకు హాజరవుతారని సింగ్‌ తెలిపారు. జార్ఖండ్‌లోని ఇండియా కూటమి నాయకులు గత వారం రాంచీలోని రాజ్‌భవన్‌లో ఆందోళన నిర్వహించారు. హెచ్‌ఈసీని ఆధునీకరించడం, పునరుద్ధరించడం, దాని ఉద్యోగులు, అధికారుల పెండింగ్‌ జీతాలను క్లియర్‌ చేయాలని అభ్యర్థిస్తూ గవర్నర్‌ ద్వారా ప్రధాని మోడీకి లేఖను సమర్పించారు.