యూసీసీ అవసరం లేదు

– కాంగ్రెస్‌ సలహా బృందం
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరం లేదని కాంగ్రెస్‌ సలహా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యక్తిగత చట్టాల సంస్కరణలకు అవకాశం ఉన్నప్పుడు యుసిసి అవసరం లేదని తెలిపింది. యూసీసీ పై సలహా ఇవ్వడం కోసం ఎనిమిది సభ్యులతో సలహా బృందాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ బృందం అంతర్గత సమావేశమయింది. ఈ సమావేశంలో అత్యధిక మంది యూసీసీ అవసరంలేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే కేంద్రం డ్రాఫ్ట్‌ ముసాయిదా విడుదల చేసే వరకూ కాంగ్రెస్‌ పార్టీ యూసీసీ పై వైఖరి వెల్లడించకూడదనే అభిప్రాయాన్ని బృందం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ బృందంలో పి.చిదంబరం, అభిషేక్‌ సంఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, మనీష్‌ తివారీ, వివెక్‌ తంక, కెటిఎస్‌ తుస్లి తదితరులు ఉన్నారు.