– సీఎం పోటీలో ఉన్న రెండు చోట్ల భారీగా దాఖలు
– స్థానిక సమస్యలు, నిరుద్యోగుల బాధలు తెలిపేందుకే గజ్వేల్, కామారెడ్డిలతో పాటు ఐదు చోట్ల ఇదే తంతూ
– ఉపసంహరింప జేసేందుకు గులాబి నేతల తంటాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 2,898 మంది బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలతో పాటు మొత్తం 5 నియోజక వర్గాల్లో 50కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో అత్యధికంగా 114, మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్‌బీ నగర్‌లో 57, మునుగోడులో 50 నామినేషన్లు దాఖలయ్యాయి. 2018 ఎన్నికల్లో సైతం మఖ్యమంత్రి పోటీ చేసిన గజ్వేల్‌లో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా చివరికి వాటిని విత్‌డ్రా చేయించారు. ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉండటంతో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే వారు ఎంత మంది అనేది వెల్లడికానుంది.
గజ్వేల్‌లో చెరుకు రైతులు,. భూబాధితులు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పోటీ చేస్తున్న గజ్వేల్, నియోజక వర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 114 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా వట్టి నాగుల పల్లి, శంకర్ పల్లికి చెందిన ప్లాట్ల బాధితులు అధికంగా ఇక్కడి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా పరిష్కారం కాక పోవడంతో ముఖ్యమంత్రిపై పోటీ చేసి తమ నిరసనను తెలియ జేసేందుకు వీరు ఎన్నికల రంగంలోకి దిగారు. అలాగే.జగిత్యాల జిల్లాలో మూత పడ్డ ముత్యం పేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీలు గతంలో హమీ ఇచ్చాయి. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రతి ఎన్నికల్లో ఈ సమస్య ప్రధాన అంశంగా మారుతోంది. దాంతో చెరుకు రైతులతో పాటు భూ బాధితులు ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేశారు.
కామారెడ్డిలోనూ అదే సీను
ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న మరో నియోజక వర్గమైన కామారెడ్డిలోను గజ్వెల్ పరిస్థితే నెలకొంది. ఇక్కడ తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 58 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలకు చెందిన పలువురు సీఎంకు వ్యతిరేకంగా బరిలోకి దిగారు. . టీపీపీఎస్ ద్వారా ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అమర వీరుల కుటుంబాలకు చెందిన పలువురు తమను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. వీరంతా సర్కారుకు తమ సమస్యలను తెలియ జేసేందుకు నామినేషన్ల అస్త్రాన్ని ఎంచుకున్నారు.