రూ.కోట్లల్లో ‘మధ్యాహ్న’ బిల్లులు పెండింగ్‌

– అమలు కాని సీఎం హామీ..
– సమ్మెకు సై..
– పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– పాత అప్పులు తీరట్లే.. కొత్త అప్పులు పుట్టట్లే..
– కొత్త మెనూకు 17 పైసలే పెంపు
– మూడ్రోజుల సమ్మెకు పిలుపు
నవతలెంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం రూ.2 వేలు పెంచి ప్రస్తుతం అందిస్తున్న వెయ్యితో కలిసి మూడు వేలు చెల్లిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ అటకెక్కింది. 2022 మార్చి బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ హామీ ఇవ్వగా.. ఎన్నో పోరాటాల తరువాత 2023 ఫిబ్రవరి 3వ తేదీన జీఓ ఎంఎస్‌ నెం.8ని విడుదల చేశారు. జీఓ విడుదలై నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ అమలు చేయడం లేదు. పైగా ఏజెన్సీని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తామని కార్మికులను బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, పెరిగిన వేతనాలు అమలు చేయాలని, శ్లాబ్‌ రేటు పెంచాలని, సబ్సిడీపై ప్రభుత్వమే సిలిండర్‌ ఇవ్వాలని, కోడి గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెబాట పడు తున్నారు. జులై 10, 11, 12వ తేదీల్లో మూడ్రోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఈఓలకు నోటీసులు అందజేస్తున్నారు.
అప్పుల్లో కార్మికులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజనం కార్మికుల కడుపు మాడుతోంది.. అప్పులు చేసి పిల్లలకు వండి పెడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. ఒకవైపు బిల్లులు పెండింగ్‌, మరోవైపు కార్మికుల వేతనాలు రాకపోవడంతో కార్మికులు అప్పుల్లో కూరుకుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ‘రేపు..మాపు’ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కార్మికులకు చెల్లిస్తున్న వెయ్యి రూపాయల గౌరవ వేతనం సైతం 4 నెలలుగా ఆగింది. కార్మికులకు మూడు వేల వేతనం చెల్లిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ అటకెక్కింది. కేంద్రప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతోందన్న విమర్శలున్నాయి. కార్మికులు తాము ఇబ్బంది పడినా.. పిల్లల కడుపు మాడ్చొద్దన్న ఉద్దేశంతో ఒంటి మీది బంగారం తాకట్టు పెట్టిమరీ వంట చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ అమలు చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. శ్లాబ్‌ రేటు 17 పైసలు మాత్రమే పెంచింది. 17 పైసాల్లో కిచిడి, ప్రై కర్రీ, సాంబారు ఎలా చేస్తామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అప్పు ల బాధ తాళలేక కార్మి కులు ఏజెన్సీలను వదిలిపోయిన పరి స్థితి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులు 24 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండ ిపెడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 1120 స్కూళ్లలో 2 వేల మంది పైచిలుకు కార్మికులు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. కానీ సర్కారు 2022 అక్టో బర్‌ నుంచి నిధులు విడుదల చేయలేదు. కోడిగుడ్డు బిల్లులతో పాటు భోజన బిల్లు లన్నీ పెండింగ్‌ ఉన్నాయి. ఒక్క నిజా మాబాద్‌ జిల్లాలోనే కార్మికులకు సర్కారు నుంచి రూ.9 కోట్ల మేర రావాల్సి ఉంది. నిజామా బాద్‌లోని బోర్గా(బి) జెడ్పీ హెచ్‌ఎస్‌కు రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుడికి రూ.13 లక్షల బిల్లు సర్కారు నుంచి రావాల్సి ఉంది. ఎన్నో ఆందోళనల తరువాత కోడిగుడ్డు ధర రూ.4 నుంచి రూ.5కు పెంచగా.. పెరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ బిల్లులు చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఉన్నత తరగతులకు మధ్యాహ్న భోజన శ్లాబ్‌ రేటు కేవలం రూ.8.17 పైసలు మాత్రమే చెల్లిస్తోంది. ఇక ప్రైమరీ విద్యార్థులకు రూ.5.45 పైసలుగా శ్లాబ్‌ రేటు నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త మెనూ ప్రకటించిన తరువాత శ్లాబ్‌ రేటు కేవలం 17 పైసలు మాత్రమే పెంచింది. కానీ మెనూలో మాత్రం కిచిడి, ఫ్రై కర్రీ, సాంబరు అందించాలని సూచించింది. 17 పైసలతో ఇవన్నీ ఎలా సాధ్యమని కార్మికులు వాపోతున్నారు. దీనికితోడు కోడిగుడ్డు ధర రూ.6కు పెరిగింది. కేంద్రం కోడిగుడ్డుకు నిధులు ఇవ్వడం లేదని తెలిసింది. మారుమూల గ్రామాలకు ఈ గుడ్లు చేరాలంటే అదనంగా మరో రూపాయి ఖర్చవుతుంది. శ్లాబ్‌ రేటును కనీసంగా రూ.15 నిర్ణయించాలని, కోడిగుడ్డుకు రూ.6 పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.
అప్పులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులపై పడుతోంది. మధ్యాహ్న భోజన కార్మికులు తమ స్థాయికి మించి అప్పులు చేసి వంటలు చేస్తున్నా సర్కారు బిల్లుల చెల్లింపుల్లో కనికరించడం లేదు. ఫలితంగా వంట చేద్దామన్నా అప్పు పుట్టక, సర్కారు నుంచి బిల్లుల రాక కార్మికులు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. నిజామాబాద్‌ కొత్త కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఖానాపూర్‌లో స్కూల్‌ ప్రారంభమై 15 రోజులు కావొస్తున్నా ఏజెన్సీ లేదు. రెండ్రోజుల కిందట అక్కడ వీడీసీ ఒకరిని నియమించింది. మోపాల్‌ మండలం బాడ్సి ప్రైమరీ స్కూల్‌ ఏజెన్సీ నిర్వాహకులు అప్పులోల్ల వేధింపులు భరించలేక గ్రామాన్ని వదిలిపోయారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లోనూ ఏజెన్సీ లేదు. పైగా కొత్త మెనూ అధికారికంగా అమలు చేయాలని ఉత్తర్వులు రాలేదు. కానీ కొత్తమంది హెచ్‌ఎంల నుంచి కార్మికులకు వేధింపులు ఎక్కువయ్యాయి.
రూ.13 లక్షల బిల్లులు రావాలి
మధ్యాహ్న భోజన బిల్లులు రూ.13 లక్షలు రావాలి. ఇందులో రూ.6 లక్షలు బయట 3-5 శాతం చొప్పున వడ్డీకి తీసుకొచ్చిన. మిగిలిన డబ్బులు బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన. ప్రభుత్వం చెల్లిస్తుందని భావించాను. 2022 అక్టోబర్‌ నుంచి నాకు బిల్లులు రాలేదు. భార్య మెడపై ఉన్న నల్లపూసల దండ సహా బ్యాంకులో ఉంది. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– చంద్రశేఖర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ బోర్గాం(బి)
తిప్పుకుంటున్నారు..
గర్ల్స్‌ హైస్కూల్‌ మోర్తాడ్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్నాను. 8 నెలలుగా కోడిగుడ్ల పైసలు రాలేదు. అలాగే 8, 9వ తరగతికి చెందిన మధ్యాహ్న భోజన బిల్లులు రాలేదు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు రావాలి. చాలాసార్లు డీఈఓ సారును కలిశాం. రేపు, మాపు అంటున్నారు తప్ప బిల్లులు అయితే రావడం లేదు. వంటకు అవసరమైన పప్పులు, ఉప్పులు తీసుకొద్దామంటే షావుకారు కూడా నమ్మే పరిస్థితి లేదు.
– పి. నిరంజన, గర్ల్స్‌ హైస్కూల్‌, మోర్తాడ్‌
పెరిగిన వేతనాలు అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి. భోజన ఏజెన్సీలను రద్దు చేసి స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టే చర్యలను మానుకోవాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా శ్లాబ్‌ రేటు పెంచాలి. సబ్సిడీపై గ్యాస్‌ అందజేయాలి. కార్మికులకు ప్రమాద బీమా చేయాలి. చాలా మంది కార్మికులు వంట చేస్తున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. వంట షెడ్లు నిర్మించాలి.
– మల్యాల గోవర్ధన్‌, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి
వేధింపులు ఆపాలి
రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచు తామని ప్రకటించగానే.. కొన్ని పాఠశాలల్లో ఏజెన్సీ నిర్వహకులపై హెచ్‌ఎంలు, టీచర్ల వేధింపులు ఎక్కువయ్యాయి. కానీ పెంచిన వేతనం ఇవ్వడం లేదు కానీ.. వేధింపులు ఆగడం లేదు. 15 సంవత్సరాల కిందట ఇచ్చిన వంట పాత్రల్లోనే వంటలు చేస్తున్నాం. ఆ పాత్రలు వంటకు ఉపయోగకరంగా లేవు. కొత్తవి అందజేయాలి. మోడల్‌ స్కూళ్లలో ఇప్పటికీ వంట పాత్రలు ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు కిరాయిలకు తీసుకొస్తాం? వెంటనే వంటపాత్రలు అందజేయాలి. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాలి.
– చామంతి లక్ష్మి, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు.