– ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ఇండియా
– తొలగింపుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని ‘భారత్’తో భర్తీ చేయాలనే సిఫార్సులు ఆమోదయోగ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను మాత్రమే వాడాలనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్యానెల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన స్పందించారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుండి కొన్ని అధ్యాయాలను గతంలోనే మినహాయించడాన్ని గుర్తు చేస్తూ పాఠశాల పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ చరిత్ర, గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం వంటి ఏకపక్ష మినహాయింపులకు ఇది కొనసాగింపుగా చూడాలి అని పినరయి విజయన్ అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ సంఫ్‌ు పరివార్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తులతో ఉందని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
”సంఫ్‌ుపరివార్ సృష్టించిన బూటకపు చరిత్రను తెల్లగా మార్చేందుకు పాఠ్యపుస్తకాల కమిటీ ఆసక్తిగా ఉంది. ఈ దేశం బహుళత్వం, సహజీవనంపై ఆధారపడి ఉండాలనే ఆలోచనకు సంఫ్‌ు పరివార్ ఎప్పుడూ వ్యతిరేకం. దానికి తాజా ఉదాహరణ ఈ ప్రతిపాదన” అని పినరయి విజయన్ అన్నారు. ఎన్‌సీఇఆర్‌టీ కమిటీ సమర్పించిన ”రాజ్యాంగ విరుద్ధ” ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.