పుజారాపై వేటు

– యశస్వి జైస్వాల్‌కు పిలుపు
– రహానెకు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు
– విండీస్‌తో టెస్టులకు భారత జట్టు ఎంపిక
సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎట్టకేలకు ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది!. కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న చతేశ్వర్‌ పుజారాకు ఉద్వాసన పలికింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో తేలిపోయిన పుజారాను సెలక్షన్‌ కమిటీ టెస్టు జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు కల్పించింది. కరీబియన్లతో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.
భారత టెస్టు జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, కె.ఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, నవదీప్‌ సైని.
నవతెలంగాణ-ముంబయి
2025 ఐసీసీ డబ్ల్యూటీసీ వేటను టీమ్‌ ఇండియా భిన్నంగా మొదలుపెట్టనుంది. మరో రెండేండ్ల తర్వాత టెస్టు చాంపియన్‌షిప్‌ మెగా పోరు ఉండటంతో.. భవిష్యత్‌ను గమనంలో ఉంచుకుని టెస్టు జట్టుకు రూపకల్పన చేస్తోంది!. అందులో భాగంగానే ఫామ్‌ కోల్పోయి జట్టుకు భారమైన చతేశ్వర్‌ పుజారాను జట్టు నుంచి తప్పించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. జులై 12న భారత్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు డొమినికాలో ఆరంభం కానుండగా.. రెండో టెస్టు జులై 20 నుంచి పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో షెడ్యూల్‌ చేశారు. 2019 కరీబియన్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-0తో క్వీన్‌స్వీప్‌ చేసింది. విండీస్‌ గడ్డపై వరుసగా గత నాలుగు టెస్టు సిరీస్‌ విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా.. తాజాగా వరుసగా ఐదో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌ సహా రిషబ్‌ పంత్‌ ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్నారు. విండీస్‌ పర్యటనకు సెలక్షన్‌ కమిటీ ఈ ముగ్గురిని పరిగణనలోకి తీసుకోలేదు.
ముగ్గురికి పిలుపు : రుతురాజ్‌ గైక్వాడ్‌ గైర్హాజరీలో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికైన యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌.. తాజాగా టెస్టు జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌, దేశవాళీ ఫస్ట్‌ క్లాస్‌ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జైస్వాల్‌కు సెలక్షన్‌ కమిటీ తొలిసారి జాతీయ జట్టు పిలుపు అందించింది. యశస్వి జైస్వాల్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, పేసర్‌ ముకేశ్‌ కుమారలు టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమికి విశ్రాంతి లభించగా.. ఉమేశ్‌ యాదవ్‌పై వేటు పడింది. ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ సైని జట్టులో చోటు సాధించాడు. మహారాష్ట్ర తరఫున రుతురాజ్‌ 28 మ్యాచుల్లో ఎనిమిది సెంచరీలు బాదాడు. రుతురాజ్‌ బ్యాటింగ్‌ సగటు 42.19. ఇక యశస్వి జైస్వాల్‌ ముంబయి తరఫున 26 ఇన్నింగ్స్‌ల్లో 80.21 సగటుతో అదరగొట్టాడు. ఇటీవల ఇరానీ కప్‌లోనూ జైస్వాల్‌ 213, 144 ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్‌, నం.3 బ్యాటర్‌గా జైస్వాల్‌కు మంచి రికార్డుంది. పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ బెంగాల్‌ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు.
రహానెకు వైస్‌ కెప్టెన్సీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన అజింక్య రహానె ఐపీఎల్‌16లో అనూహ్యంగా కొత్త అవతారంలో అదరగొట్టాడు. ఐపీఎల్‌ మెరుపులతో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం దక్కించుకున్న రహానె.. తాజాగా వెస్టిండీస్‌ టూర్‌లో వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు సైతం అందుకున్నాడు. ఇక చతేశ్వర్‌ పుజారాపై వేటుతో భారత జట్టు నం.3 స్థానంలో కొత్త బ్యాటర్‌ను చూడబోతుంది. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా రానుండగా.. యశస్వి జైస్వాల్‌ నం.3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్‌ జాతీయ జట్టు తరఫున అరంగ్రేటం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు రుతురాజ్‌ వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేయగా.. ముకేశ్‌ కుమార్‌ సైతం ఏ ఫార్మాట్‌లోనూ ఇంకా తొలి మ్యాచ్‌ ఆడలేదు.
పేస్‌ దళపతి సిరాజ్‌ : హైదరాబాద్‌ మియా భారు మహ్మద్‌ సిరాజ్‌ భారత జట్టు నయా పేస్‌ దళపతి. బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యలతో దూరం కాగా, మహ్మద్‌ షమికి విశ్రాంతి లభించింది. దీంతో సెలక్షన్‌ కమిటీ మహ్మద్‌ సిరాజ్‌ సారథ్యంలోని పేస్‌ విభాగాన్ని ఎంచుకుంది. సిరాజ్‌ ముందుండి నడిపించనుండగా.. శార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, ముకేశ్‌ కుమార్‌, జైదేవ్‌ ఉనద్కత్‌లు అతడికి సహకారం అందించనున్నారు. స్పిన్‌, ఆల్‌రౌండర్‌ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులో నిలిచారు. వికెట్‌ కీపర్లుగా తెలుగు తేజం శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌లు ఎంపికయ్యారు. రోహిత్‌, విరాట్‌లకు విశ్రాంతి లభిస్తుందని అంచనాలు ఏర్పడినా.. స్టార్‌ క్రికెటర్లు ఇద్దరూ కరీబియన్‌ టెస్టు సవాల్‌కు సిద్ధం కానున్నారు.