నువ్వద్దె

నాయిన
మొగులంత పయ్య పయ్యగా
అయితే బాగుండు కదానే.
అవ్‌ బిడ్డా
ఆకాసం సుట్టు పొత్తివోసినట్టు
వరదగూడు కట్టాలె
మొగులు తల్లడియ్యాలే
ఒక్క సినుకు జాలు అవ్వతోడు
తిన్నంత భారాబరి రా.
నీయవ్వ
సినుకు వడాలని మొక్కరాదే.
నవ్వుకుంట
వాన దేవునికి
నా మనవరాలు నిస్తా
పెద్ద గౌడు గోపగోని ఎంకులు బావ
ఇంటికాడ నుండి ఘటం కుండ దెచ్చి
సామీ తల్లి అని కల్లు సాక వొస్తా
ఇగ సాలూన.
సినుకులు వడితే
గిట్ల మనుషులు ఇండ్లల్ల ఉంటారే?
లేలే
పుట్ట బెదిరినట్టు జిబజిబ మంది చెలుకల్ల
తల్లులంతా ఇత్తునపు ఒడికడుతరు
భూదేవారను
ఆరుద్ర పురుగులంతా సక్కదనం జేస్తరు
సేమటొడిపే మనుషులు
మోదుగాకు లెక్క కలిసిపోయి
పచ్చటి ఇస్తరాకై లోకానికి బువ్వవెడుతరు
అన్నం బెట్టే చేతులకు మొక్కాలే బిడ్డా.
నాయినకు చేతులు జోడిస్తూ నేను.

– నాగిళ్ళ రమేశ్‌, 91004 82478