– టీఎస్‌ఆర్టీసీకి రూ.7 కోట్ల అద్దె బకాయిలు
– రూ.2.5 కోట్ల విద్యుత్ బకాయిలు
– కరెంట్ సరఫరా నిలిపివేత
నవతెలంగాణ-ఆర్మూర్
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్‌రెడ్డికి చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు గురువారం ఆర్టీసీ, విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. అద్దె బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు, విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్‌శాఖ అధికారులు నోటీసులిచ్చి.. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని ఖాళీ చేయాలని అనౌన్స్ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్టాండ్ పక్కనున్న ఆర్టీసీ స్థలాన్ని 33 ఏండ్లకు లీజ్‌కు తీసుకుని జీవన్‌రెడ్డి మాల్ నిర్మించిన విషయం విధితమే. అయితే లీజ్‌కు సంబంధించి రూ. 7 కోట్లు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో హైదరాబాద్ ఆర్టీసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం మాల్‌కు వచ్చి నోటీసులు ఇచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వ్యాపారస్తులు ఖాళీ చేయాలంటూ అధికారులు అనౌన్స్‌మెంట్ చేయడంతో అక్కడున్న వారు అయోమయానికి గురయ్యారు. అంతేకాకుండా, కాంప్లెక్‌కు రూ.2.5 కోట్ల విద్యుత్ బకాయిలు ఉండటంతో కరెంటు సరఫరా నిలిపి వేసినట్లు డివిజనల్ విద్యుత్ కార్యాలయం ఏడీఈ శ్రీధర్ తెలిపారు.