– మాజీ మంత్రి మండవ వేంకటేశ్వరరావు…
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రజలే దేవుళ్లు, ప్రజాసేవయే మాదవ సేవా అనే లక్ష్యంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు చెప్పారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామ శివారున గల వీహెచార్ కన్వెన్షన్లో నిజామాబాద్ జిల్లా తెలంగాణ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో పలువురు హజరయ్యారు. అనంతరం సావనీరన్ను విడుదల చేశారు. పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లోను తెలుగుదేశం మూలాలు ఉన్న నాయకులు ఉన్నారని, తెలంగాణలో పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దుచేశారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలను మార్చాలంటే ఎన్టీఆర్ మళ్ళీ రావాలన్నారు. నందమూరి తారక రామారావు అంటేనే ఓ వ్యక్తికాదని, ఓ శక్తి అని తెలుగుజాతి స్ఫూర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని తెలిపారు. మాజీ మంత్రి, భాజపా నేత బాబు మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన నేత ఎన్టీఆర్ అని,అయనకు భారతరత్న కోసం ప్రధాని మోదీని కలుస్తానన్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇచ్చేంతవరకు తెలుగుజాతిగా పోరాటం ద్వారా సాధించుకుందా మన్నారు. ఎన్టీఆర్ వద్ద తాను ఒక్క నటుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్ననట్లు గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత విశేషాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్మ సేవా సమితి సభాధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్, కమ్మ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామారావు, ప్రవాస భారతీయుడు రవికుమార్, నాయకులు డాక్టర్ గోపికృష్ణరెడ్డి, యాదగౌడ్, నగేష్ రెడ్డి, కేశవేణు, అమర్నాద్ బాబు, రాజేశ్వర్, రాజేందర్ గడుగు గంగాధర్, హన్మంత్ రెడ్డి, నాయుడు ఆంజనేయులు, బ్రహ్మనందం, పార్టీలకు అతీతంగా పలువురు హజరయ్యారు.