స్వదేశంలో గిల్‌ తొలి సెంచరీ

– స్వదేశంలో గిల్‌ తొలి సెంచరీ
– రాణించిన కోహ్లి, పుజార, రోహిత్‌
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 289/3
– భారత్‌, ఆసీస్‌ నాల్గో టెస్టు మూడో రోజు
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
శుభ్‌మన్‌ గిల్‌ (128) శతకోత్సవం. ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ పద్మవ్యూహంతో పరుగులను కట్టడి చేయగా.. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ శతకంతో గర్జించాడు. అహ్మదాబాద్‌లో సెంచరీతో అదరగొట్టిన గిల్‌.. రోహిత్‌, పుజార, కోహ్లిలతో మూడు కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ముందుండి నడిపించాడు. ఆసీస్‌ మూడు సెషన్లలో మూడు వికెట్లతో మూడో రోజును అసంతృప్తిగా ముగించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 191 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.
శుభ్‌మన్‌ గిల్‌ (128, 235 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి (59 బ్యాటింగ్‌, 128 బంతుల్లో 5 ఫోర్లు) ఆసీస్‌ బౌలర్లను దంచికొట్టారు. యువ ఓపెనర్‌ స్వదేశంలో తొలి టెస్టు శతకం అందుకోగా.. విరాట్‌ కోహ్లి మరో అర్థ సెంచరీతో చెలరేగాడు. రోహిత్‌ శర్మ (35), చతేశ్వర్‌ పుజార (42, 121 బంతుల్లో 3 ఫోర్లు) రాణించగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 289/3 పరుగులతో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 191 పరుగుల వెనుకంజలో నిలిచిన టీమ్‌ ఇండియా.. ఏడు వికెట్లు చేతిలో ఉండటంతో నేడు ధనాధన్‌ జోరుపై కన్నేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్‌ కోహ్లికి తోడుగా రవీంద్ర జడేజా (16 బ్యాటింగ్‌, 54 బంతుల్లో 1 సిక్స్‌) అజేయంగా క్రీజులో నిలిచాడు.
తొలి సెషన్‌ : ఓపెనర్లు శుభారంభం
ఓవర్‌నైట్‌ స్కోరు 36/0తో మూడో రోజు బ్యాటింగ్‌ మొదలెట్టిన టీమ్‌ ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్యాటింగ్‌క అనుకూలిస్తున్న పిచ్‌పై రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ వేగంగా ఆడేందుకు మొగ్గు చూపారు. ఓపెనర్లు ధాటిగా పరుగులు సాధించగా.. ఆసీస్‌ బౌలర్లలో ఎవరూ గిల్‌, రోహిత్‌లను ఇబ్బంది పెట్టలేకపోయారు. భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం దిశగా సాగుతున్న తరుణంలో రోహిత్‌ శర్మ ఓ సాధారణ బంతికి వికెట్‌ కోల్పోయాడు. కునేమాన్‌ ఓవర్లో బ్యాక్‌ఫుట్‌ పంచీ షాట్‌ ఆడిన రోహిత్‌ శర్మ.. షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో లబుషేన్‌ చేతికి చిక్కాడు. చెమటోడ్చకుండా దక్కిన వికెట్‌తో ఆసీస్‌ సంబుర పడింది. అప్పటికి భారత్‌ స్కోరు 21 ఓవర్లలో 74 పరుగులు. తొలి గంట ఆటలో కెప్టెన్‌ వికెట్‌ను చేజార్చుకున్న భారత్‌.. లంచ్‌ విరామానికి మరో పడకుండా జాగ్రత్త పడింది. టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారతో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఉదయం సెషన్లో ఆసీస్‌ ఓ వికెట్‌ దక్కించుకోగా, భారత్‌ 93 పరుగులు సాధించింది.
రెండో సెషన్‌ : నెమ్మదించిన వేగం!
లంచ్‌కు ముందు రోహిత్‌, గిల్‌ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్‌కు పుజార తోడవటంతో సహజంగానే ఇన్నింగ్స్‌లో వేగం మందగించింది. లంచ్‌ విరామం అనంతరం భారత్‌ 59 పరుగులు నమోదు చేసింది. తొలి సెషన్లో 3.48 రన్‌రేట్‌తో పరుగులు పిండుకున్న భారత్‌.. రెండో సెషన్లో 2.98 రన్‌రేట్‌కు పడిపోయింది. ఓ ఎండ్‌లో పుజార డిఫెన్స్‌తో అడ్డుగోడగ నిలువగా.. మరో ఎండ్‌లో గిల్‌ పరుగుల బాధ్యత తీసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్‌ అలవోకగా పరుగులు సాధించాడు. స్పిన్నర్లపై క్రీజు వదిలి స్వేచ్ఛగా బౌండరీలు సాధించాడు. 10 ఫోర్లు, ఓ సిక్సర్‌ సంధించిన శుభ్‌మన్‌ గిల్‌ 194 బంతుల్లో స్వదేశంలో తొలి శతకం నమోదు చేశాడు. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా బౌండరీ బాదిన గిల్‌ అభిమానులకు అభివాదం చేస్తూ శతక సంబురం చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న పుజార సైతం అనూహ్యంగా వికెట్‌ కోల్పోయాడు. సెషన్లో ఏమాత్రం మెప్పించని టాడ్‌ మర్ఫీ.. టీమ్‌ ఇండియా డిఫెన్స్‌ను ఛేదించాడు. పుజారను ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేసి బ్రేక్‌ సాధించాడు. టీ విరామం ముంగిట పుజార వికెట్‌తో ఆసీస్‌ శిబిరం ఊరట చెందింది. విరాట్‌ కోహ్లి వస్తూనే లయాన్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. మూడు బంతుల్లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌, అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ సహా ఓ బంతిని ఆడలేకపోయాడు. 188/2 వద్ద రెండో సెషన్‌ ముగిసింది.
మూడో సెషన్‌ విరాట్‌ కోహ్లి అర్థ సెంచరీ
శుభ్‌మన్‌ గిల్‌ (128) ఇన్నింగ్స్‌ మూడో సెషన్లో ముగిసింది. ఆసీస్‌ బౌలర్లపై స్పష్టమైన ఆధిపత్యం చూపించిన గిల్‌.. ఏ దశలోనూ అసౌకర్యంగా కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల నడుమ రోజంతా క్రీజులో నిలిచిన గిల్‌ బాగా నీరసించాడు!. ఫిజియో సాయం తీసుకుని బ్యాటింగ్‌ కొనసాగిం చాడు. సెంచరీ అనంతరం మరో రెండు బౌండరీలు బాదిన గిల్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాథన్‌ లయాన్‌ ఓవర్లో వికెట్ల ముందు చిక్కిన గిల్‌.. శతక ఇన్నింగ్స్‌ను అసం తృప్తిగా ముగించాడు. రోహిత్‌తో 74, పుజారతో 113, కోహ్లితో 58 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన గిల్‌..78.4 ఓవర్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (00)తో కలిసి విరాట్‌ కోహ్లి మూడో రోజు మరో వికెట్‌ పడ కుండా జాగ్రత్త పడ్డాడు. లయాన్‌ నిలకడగా సవాల్‌ విసిరినా ఐదు ఫోర్లతో 105 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. 94 ఓవర్ల అనంతరం కొత్త బంతిని తీసుకున్న ఆసీస్‌.. వికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నించింది. కోహ్లి, జడేజాలు కొత్త బంతిపై వేగంగా పరుగులు పిండుకుని ఎదురుదాడి చేశారు. చివరి సెషన్లో భారత్‌ 101 పరుగులు చేసి, ఓ వికెట్‌ కోల్పోయింది.
రోహిత్‌ ఏ 17000
భారత కెప్టెన్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17000 పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. 17000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 2007లో ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ 48 టెస్టులు, 241 వన్డేలు, 148 టీ20ల్లో వరుసగా 3348, 9782, 3853 పరుగులు సాధించాడు. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు 17000 పరుగుల క్లబ్‌లో ఉన్నారు.
స్కోరు వివరాలు….
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 480/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) లబుషేన్‌ (బి) కునేమాన్‌ 35, శుభ్‌మన్‌ గిల్‌ (ఎల్బీ) నాథన్‌ లయాన్‌ 128, చతేశ్వర్‌ పుజారా (ఎల్బీ) టాడ్‌ మర్ఫీ 42, విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ 59, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ 16,
ఎక్స్‌ట్రాలు :09, మొత్తం (99 ఓవర్లలో 3 వికెట్లకు) 289.
వికెట్ల పతనం : 1-74, 2-187, 3-245.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 17-2-74-0, కామెరూన్‌ గ్రీన్‌ 10-0-45-0, నాథన్‌ లయాన్‌ 37-4-75-1, మాథ్యూ కునేమాన్‌ 13-0-43-1, టాడ్‌ మర్ఫీ 22-0-45-1.