17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజనీర్ల జాతీయ సదస్సు

– ఏసీసీఈఐ హైదరాబాద్‌ కేంద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోనే అతి పెద్ద సివిల్‌ ఇంజినీర్ల సమ్మేళనం, జాతీయ సదస్సు జూలై 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ లో నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (ఇండియా) తెలిపింది. ఈ సదస్సును హైదరాబాద్‌ కేంద్రం నిర్వహించనున్నది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్‌ సౌత్‌ ఇండియా అధ్యక్షులు కె.రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ సదస్సులో 600 మంది ప్రతినిధులతోపాటు ఎనిమిది దేశాల నుంచి 14 మంది అంతర్జాతీయ వక్తలు, జాతీయ వక్తలు పాల్గొంటారని తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.రెండు లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఎత్తైన భవనాల్లో హైదరాబాద్‌ భారతదేశంలో ఎనిమిది శాతం వాటా కలిగి ఉన్నదన్నారు. జాతీయ బిల్డర్లు సివిల్‌ ఇంజినీర్లనీ, వారి సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు సీహెచ్‌. నర్మద, హైదరాబాద్‌ సెంటర్‌ చైర్మెన్‌ కాశీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.