ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి

–  పీఆర్టీయూ తెలంగాణ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిస్కారం కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులకు పీఆర్టీయూ తెలంగాణ పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బదిలీలు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, తొమ్మిదేండ్లుగా వేచిచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల నియామకం, సీపీఎస్‌ అమలు కన్నా ముందే జరిగినందున కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఆరు వేల మంది ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్‌ను పునరుద్దరించాలని కోరారు. సీపీఎస్‌ను పూర్తి చేయాలని తెలిపారు. ఏండ్ల తరబడి ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలనీ, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయుల ఈహెచ్‌ఎస్‌ను వెంటనే అమలు చేయాలని తెలిపారు. 13 జిల్లాల స్పౌజ్‌ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని పేర్కొన్నారు. సమస్యల సాధన కోసం ఆందోళనా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కోరారు.