తల్లికంటే ఎక్కువ సేవలు అందించేవారు నర్సులు

Nurses provide more services than mothers– తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో నర్సింగ్‌ కళాశాల ప్రారంభోత్సవంలో చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అనారోగ్యంతో అస్పత్రిలో చేరితే తల్లికంటే ఎక్కువ సేవల్ని నర్సులు అందిస్తారనీ, వారి సేవలకు వెలకట్టలేమని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అన్నారు. శనివారం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల భవనాన్ని మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవన సముదాయాన్ని సంస్థ నిర్మించిందని తెలిపారు. నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్‌ ఉందనీ, విద్యార్థులందరూ ఈ సేవల్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ పురోగతి కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. సంస్థ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ మాట్లాడుతూ, నర్సింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉన్నదనీ, ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. 50 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ కోటా 20 సీట్లలో ఆర్‌టిసి ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ వి.రవీందర్‌, తార్నాక ఆసుపత్రి సలహాదారు, ఓఎస్డీ సైదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కష్ణకాంత్‌, జాయింట్‌ డైరెక్టర్‌ (విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ) సంగ్రామ్‌ సింగ్‌ జి. పాటిల్‌, సీఈఈ రాంప్రసాద్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ఫ, తార్నాక టీఎస్‌ఆర్టీసీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శైలజా కష్ణమూర్తి, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వసుంధర తులసి తదితరులు పాల్గొన్నారు.