రోగుల పాలిట‌ ఆశాదీపం

Nursing patients is a beacon of hopeసేవ చేయాలనే సంకల్పం అందరికి ఉండదు. అది కొందరికి మాత్రమే ఉంటుంది. అందులోనూ రోగులకు సేవ చేయడం చిన్న విషయం కాదు. దానికి ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ అవసరం. ఓ రోగం తగ్గేందుకు వైద్యం ఎంత అవసరమో నర్సుల సేవ కూడా అంతే అవసరం. అలా రోగులకు అనునిత్యం సేవ చేసిన గొప్ప వ్యక్తి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఈ రోజు ఆమె జయంతి. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఆ సేవా మూర్తిని స్మరించుకుంటూ, ఆమె అడుగు జాడల్లో నడుస్తున్న నర్సులందరికి అభినందనలు.
ద లేడీ విత్‌ ద ల్యాంప్‌గా గుర్తింపు పొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఇటలీలోని ఓ దళిత కుటుంబంలో పుట్టారు. ఎంతో గొప్పింటి అమ్మాయి అయినా నర్సింగ్‌ చేయడానికే నిశ్చయించుకుంది. దీని కోసం తన సంఘంపై తిరగబడింది. స్త్రీలు ఇంటి పట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. ఆ రోజుల్లో ఆస్పత్రులు అద్వాన్న స్థితిలో ఉండేవి. శుచి, శుభ్రత ఉండేవి కావు. అయినా ఫ్లోరెన్స్‌ నర్సింగ్‌ చేయడానికే నిర్ణయించుకుంది. 1852లో ఐర్లండ్‌ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులు చూసి వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని అనుకున్నది. 1853లో సిస్టర్‌ ఆఫ్‌ చారిటికి వెళ్ళింది. కొన్నేండ్లకు నాయనమ్మకు సేవ చేసేందుకు తిరిగి లండన్‌ వచ్చింది. అక్కడ కలరా వ్యాపించడంతో రోగులకు రాత్రీపగలు విశేష సేవలు అందించింది. 1854-56లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లోరెన్స్‌ తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు సేవలు అందించి వారికి ధైర్యం చెప్పేది. చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకెళ్లి సేవలు చేసేది.
కలకాలం జీవించి ఉంటుంది
మొదట్లో ఆమెను చూసి అధికారులు మండిపడేవారు. తర్వాత ఆమె సేవకు ముగ్ధులయ్యారు. ఆసుపత్రుల్లో చోటు సరిపోకపోతే, అధికారులను ఒప్పించి పాత ఇళ్ళను, భవంతులను ఆస్పత్రులుగా మార్చేది. విశ్రాంతి మరచి అనునిత్యం పనిచేసేసరికి ఆమె చిక్కిపోయింది. అయినా తన సేవలను కోనసాగించేది. ‘తాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి. మీ ఇళ్ళకి డబ్బు పంపండి. వారి భుక్తి గడుస్తుంది’ అని ఆమె రోగులకు చెప్పేది. భారతదేశానికి కూడా ఆమె విశేష సేవలు అందించింది. 1859లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు కమిషన్‌ నిర్మించింది. మహిళా నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుధ్యం మెరుగుపడింది. ఫ్లోరెన్స్‌ సలహాలతో మన దేశంలో మరణాలు రేటు తగ్గింది. సేవా నిరతి గల ప్రతి నర్సులో ఆమె కలకాలం జీవించి ఉంటుంది.

సేవలోనే తృప్తి
మాది నల్లగొండ జిల్లా హుజూర్నగర్‌. నాన్న సైకిల్‌ షాప్‌ నడిపేవారు. నేను గర్ల్స్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నాను. మా స్కూల్‌ పక్కనే ప్రభుత్వ హాస్పిటల్‌ ఉండేది. మేము గోడలెక్కి ఆ హాస్పిటల్లో జరిగేవన్నీ చూస్తుండే వాళ్ళం. తెల్ల డ్రెస్సులు వేసుకొని నర్సులు రోగులకు సేవ చేయడం, వాళ్ళని అందరూ ప్రేమతో పలకరించటం చూసేవాళ్ళం. నాకూ నర్స్‌ కావాలని, రోగులకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే అనుకోకుండా బీకాంలో చేరాల్సి వచ్చింది. డిగ్రీ తర్వాత లా చదవాలకున్నా. కానీ ఎందుకో బీకాం డిస్‌ కంటిన్యూ చేసి నర్సింగ్‌ ట్రైనింగ్‌కి వెళ్ళిపోయా. ట్రైనింగ్‌ వరంగల్‌ ఎంజీఎంలో. నా ఫస్ట్‌ పోస్టింగ్‌ పాలకుర్తి, వరంగల్‌ జిల్లా. నాది 30 ఏండ్ల అనుభవం. 15 ఏండ్లు ఎంజీఎంలో చేశాను. తర్వాత సీకేఎంకి వేశారు. అంటే హన్మకొండలోని గుట్ట కింద దవాఖానా అంటారు. ఇక్కడ అన్నీ డెలివరీ కేసెస్‌ వచ్చేవి. సిజేరియన్స్‌ కూడా చేయాల్సి వచ్చేది. నేను సిజేరియన్‌ కంటే నార్మల్‌ డెలివరీకే ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. పేషంట్లకి ధైర్యం చెప్పే వాళ్లం. ప్రస్తుతం నేను క్యాన్సర్‌ హాస్పిటల్లో చేస్తున్నా. నా ఉద్యోగ జీవితంలో తృప్తినిచ్చిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా సేవలోనే తృప్తి, సంతోషం ఉన్నాయి. అందరూ బాగుండాలి. ఒక రోగి కోలుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
– రాచకొండ పద్మావతి, హెడ్‌ నర్స్‌,
ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

నా వృత్తికి న్యాయం చేస్తున్నా
మా సొంతూరు బండ కొత్త పల్లి, గుండాల మండలం, జనగామ జిల్లా. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అక్కడి పరిస్థితులు చూసి సేవ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. అది కాక నర్స్‌గా శిక్షణ తీసుకుంటే కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్‌ చేయొచ్చు. అందుకే నర్సు వృత్తిలోకి వచ్చాను. 2010 నుంచి నర్స్‌గా చేస్తున్నాను. పిల్లల విభాగంలో ఎక్కువగా చేశాను. అనేక అనారోగ్య సమస్యలతో పిల్లలు ఆస్పత్రికి వస్తుంటారు. వాళ్ళను చూసినప్పుడు ఎలాగైనా కాపాడాలి అనే తపన నాలో మొదలవుతుంది. గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ తర్వాత బేబీని ఎలా చూసుకోవాలి వీటిపై అవగాహన కల్పిస్తుంటాను. ఐదేండ్ల నుండి ఎమర్జెన్సీ వార్డులో చేస్తున్నాను. నేను చాలా త్వరగా స్పందిస్తానని ఈ విభాగంలో వేశారు. అప్పుడే పుట్టిన బిడ్డల వార్డ్‌ అన్నమాట. ప్రమాద పరిస్థితుల నుండి బయట పడి తల్లీ, బిడ్డా క్షేమంగా ఇంటికి వెళ్తున్నప్పుడు నా వృత్తికి నేను న్యాయం చేశాననే తృప్తి ఉంటుంది.
– బి.పరిమళ,
పిర్జాదిగూడా, మేడిపల్లి