పోషకాల ఫలం

Nutrients fruitసీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సి, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా లభించే సీతాఫలాల్ని కచ్చితంగా తినాలి. రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. అయితే సీతాఫలం అనగానే చాలా మంది రకరకాల అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాటిని తింటే జలుబు చేస్తుందని కొందరు, షుగర్‌ వ్యాధి వస్తుందని మరికొందరు… షుగర్‌ ఉన్న వారు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని… ఇలా ఎన్నో రకాల అపోహలు. ఇలాంటివి వింటే అమ్మో… వద్దులే తినకపోతేనే మంచిది అని అనుకునే ప్రమాదం ఉంటుంది. నిజానిజాలు తెలియనంతవరకూ ఈ భ్రమలు పోవు. కానీ… తినకపోతే ఎన్నో పోషకాల్ని మనం మిస్సవుతాం కాబట్టి… అపోహల సంగతి తెలుసుకోవాల్సిందే.
డయాబెటిస్‌ ఉంటే తినకూడదా?
సీతాఫలం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54. అందువల్ల ఈ పండును షుగర్‌ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు. ఎందుకంటే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియమం ప్రకారం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 55 లేదా అంతకంటే తక్కువ ఉండే పండ్లను డయాబెటిస్‌ ఉన్నవారు తినవచ్చు. అందువల్ల డాక్టర్లే ఈ పండ్లను తినమని సూచిస్తారు.
హార్ట్‌ పేషెంట్లు తినకూడదా?
సీతాఫలం తింటే… మన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవు తుంది. ఇందులోని సి విటమిన్‌, పొటాషియం, మాంగనీస్‌ వంటివి గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల సీతాఫలం తింటే గుండెకు మంచిది. హార్ట్‌ పేషెంట్లు కూడా సీతాఫలాన్ని చక్కగా తినేయొచ్చు.
విరేచనాలు అవుతాయా?
నిజానికి సీతాఫలం జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విరేచనాల్ని తగ్గిస్తుంది. మరో గొప్ప విషయమేంటంటే… కడుపులో అల్సర్లు, ఏసీడీటీ వంటి వాటిని ఈ పండు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌ బి కాంప్లెక్స్‌, ముఖ్యంగా విటమిన్‌ బి6 అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు కూడా సీతాఫలాన్ని సంతోషంగా తినవచ్చు.
పీసీఓడీ ఉన్న వారు తినకూడదా?
ఇదో పెద్ద భ్రమ. పీసీఓడీ అనేది పీరియడ్స్‌కి సంబంధించిన సమస్య. కానీ సీతాఫలంలో ఉండే ఐరన్‌ మహిళలకు మేలు చేస్తుంది. ఇది మహిళల్లో సంతాన సాఫల్యతను పెంచుతుంది. అలసట, నీరసాన్ని తగ్గిస్తుంది. గాయాలు, దురదల్ని తగ్గిస్తుంది. కాబట్టి పీసీఓడీ ఉన్న మహిళలు కూడా సీతాఫలాన్ని తినాలి.