గిరిజన వర్సిటీ బిల్లుకు ఓకే

OK for tribal varsity bill– పసుపు బోర్డుకు గ్రీన్‌ సిగల్‌
– కృష్ణా ట్రిబ్యునల్‌-2 ఏర్పాటు
– పీఎంయూవై వంట గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ రూ.100 పెంపు
– కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన కృష్ణా ట్రిబ్యునల్‌-2 ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడిం చారు. ”ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ పెంచుతూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటివల తగ్గించిన రూ.200 తో కలిపి మొత్తం ఇప్పుడు రూ. 300 మేర ఉపశమనం కల్పించినట్టయ్యింది” అని అన్నారు.
రూ.889.07 కోట్లతో గిరిజన యూనివర్సిటీ
”తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్‌ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర వర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 13 షెడ్యూలులో పేర్కొన్నదాని ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం కోసం కేంద్రీయ విశ్వ విద్యాల యాల చట్టం-2009లో సవరణ నిమిత్తం కేంద్రీయ విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు-2023 పేరిట పార్లమెంటు లో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. దీనికోసం రూ.889.07 కోట్ల నిధులను సర్దుబాటు చేయనున్నది” అని అన్నారు.
పసుపు బోర్డుకు మోక్షం
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపుపై అవగాహనతో పాటు వినియోగం, ఎగుమతులను పెంచడం, అంతర్జాతీయంగా కొత్త మార్కె ట్లను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. నూతన ఉత్పత్తుల్లో పరిశోధనాభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సంప్రదాయ పరిజ్ఞానాన్ని జోడించి పసుపు ఆధారిత ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు ఉపయోగ పడనుంది. భారత్‌ నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి 1 బిలియన్‌ అమెరికా డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్‌-2కి ఆమోదం
”తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి) చట్టం-1956 కింద కృష్ణా జల వివాద ట్రిబ్యునల్‌-2కి సంబంధిం చిన నిబంధనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి చట్టంలోని సెక్షన్‌ 5(1) కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-2 (కెడబ్ల్యూడిటి-2)కి మరింత టెర్మస్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టిఒఆర్‌) జారీకి ఆమోదం తెలిపింది. ఇది చట్టపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడం, దాని ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులో అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి) చట్టం-1956 సెక్షన్‌ (3) కింద లేవనెత్తిన సమస్యలపై ఆధారపడి ఉంటుంది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలలో అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది” అని తెలిపారు.
”ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి చట్టం-1956 సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలపై కేంద్ర ప్రభుత్వం 2004 ఏప్రిల్‌ 2న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌-2ని ఏర్పాటు చేసింది. తదనంతరం 2014 జూన్‌ 2న అంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం (ఏపీఆర్‌ఏ)-2014లోని సెక్షన్‌ 89 ప్రకారం, ఏపీఆర్‌ఏ-2014లోని పేర్కొన్న సెక్షన్‌లోని క్లాజులు (ఎ), (బి)లను పరిష్కరించడానికి కెడబ్ల్యూడిటి-2 పదవీకాలం పొడిగించబడింది” అని అన్నారు.
”తదనంతరం, తెలంగాణ ప్రభుత్వం 2014 జులై 14న కేంద్ర జలవనరుల విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ లకు ఫిర్యాదును పంపింది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై వివాదాన్ని ఇది స్పష్టం చేసింది. 2015లో సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్రం రిట్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. 2018లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్‌ పరిధిని మాత్రమే పరిమితం చేయాలని తెలంగాణ రాష్ట్రం కేంద్ర జలవనరుల విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖలను కోరింది.
ఆ తరువాత ఈ విషయం 2020లో జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి నట్లుగా తెలంగాణ రాష్ట్రం 2021లో రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తదనంతరం ఈ విషయంలో జలవనరులు విభాగం న్యాయ మంత్రిత్వ శాఖను చట్టపరమైన అభిప్రాయాన్ని కోరింది” అని తెలిపారు.