– ఆర్థిక శాఖ సూత్రప్రాయ అంగీకారం
– పూర్తి వివరాలు కోరిన విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం వర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులను విద్యాశాఖ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ జాయింట్ సెక్రెటరీ ఎం హరిత సోమవారం మెమోను జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 2003, డిసెంబర్ 22 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై, 2004, సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం వర్తింపజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి మూడో తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దానిప్రకారం రాష్ట్రంలోని డీఎస్సీ-2003 ఉపాధ్యాయులతోపాటు ముందే నోటిఫికేషన్ విడుదలై 2004, సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకాలు పూర్తయిన ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుని త్వరలోనే ఉత్తర్వులను విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
వెంటనే ఉత్తర్వులివ్వాలి : టీఎస్‌పీటీఏ
డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తించే అంశంపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోలేదని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉత్తర్వులు వెలువడే వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందనీ, ఎప్పుడో జరగాల్సిన నిర్ణయాన్ని కాలయాపన చేయ డం సమంజసం కాదని తెలిపారు. వెంటనే దానిపై ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు.