డిసెంబర్‌ 4న చలో పార్లమెంట్‌ జాతీయ దళిత్‌ సమ్మిట్‌ పిలుపు

Chalo Parliament on December 4 Call of National Dalit Summit– ఎస్సీల సమస్యలపై జాతీయ ఉద్యమం
– భవిష్యత్తులో రాష్ట్రాల వారీగా సదస్సులు
– ప్రజల్లోకి బీజేపీ సర్కార్‌ దళిత వ్యతిరేక విధానాలు
– 2024 ఎన్నికల్లో దళితుల సమస్యలే రాజకీయ ఎజెండా
– హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన సమావేశాలు
– పది మందితో జాతీయస్థాయి సమన్వయ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించనున్నట్టు జాతీయ దళిత సమ్మిట్‌ ప్రకటించింది. అందులో భాగంగా డిసెంబర్‌ నాలుగో తేదీన చలో పార్లమెంట్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పిలుపునిచ్చింది. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో రెండురోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ దళిత్‌ సమ్మిట్‌ ఆదివారం విజయవంతంగా ముగిసింది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 92 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 322 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పది మందితో జాతీయస్థాయి సమన్వయ కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఎంపీ రామచంద్ర డోమ్‌, విఎస్‌ నిర్మల్‌, ధీరేంద్ర ఝా, గుల్జార్‌సింగ్‌ గోరియా, డాక్టర్‌ విక్రంసింగ్‌, కర్నెల్‌సింగ్‌ ఎక్‌లాహ, బి వెంకట్‌, సాయిబాలాజీ, వీణా పల్లికల్‌ సభ్యులుగా ఉన్నారు.
దళితుల సమస్యలు రాజకీయ ఎజెండాగా మారాలి : బి వెంకట్‌
ఉత్పత్తి రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్న దళితులకు రాజ్యాంగం ఎలాంటి హక్కులు కల్పించింది, 75 ఏండ్లుగా అవి ఎలా అమలవుతున్నాయనే అంశాలపై చర్చించామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక అంశాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. కులనిర్మూలన జరగాలంటూ రాజ్యాంగంలో ఉన్నా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా కుల వివక్ష, దళితులపై దాడులు, సామాజిక అణచివేత నేటికీ కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. పేదరికం నిర్మూలన, ఉపాధి కల్పన, గౌరవంగా జీవించే హక్కు సంపూర్ణంగా అమలు కావడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్దతుతోనే దళితులు, సామాజిక తరగతులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దాడులకు పాల్పడే వారిని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రక్షిస్తున్నదని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తామన్నారు. దేశంలో దళితుల సమస్యలే ఎజెండా కావాలని వివరించారు. చంద్రునిపైకి రాకెట్‌ను పంపించే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా భారత్‌లో అంటరానితనం, వివక్ష, దోపిడీ, పీడన ఉండడం దురదృష్టకరమని అన్నారు. మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం స్థానంలో మనస్మృతిని, చాతుర్వర్ణాన్ని తేవాలని చూస్తున్నదని చెప్పారు. భూమి, ఉపాధి, సామాజిక న్యాయం, అందరికీ విద్య, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ఉద్యమిస్తామని అన్నారు. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దళితుల సమస్యలే రాజకీయ ఎజెండాగా మారాలని చెప్పారు. దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాలని కోరారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేస్తాన్నారు.
అంటరానితనం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలి : మల్లేపల్లి లక్ష్మయ్య
దళితులు ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై ఈ సమ్మిట్‌లో సుదీర్ఘంగా చర్చించామని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మెన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య చెప్పారు. వాటి పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న దళితుల సమస్యలను ఎజెండాలోకి తీసుకుంటామని చెప్పారు. అక్కడ కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్‌ నాలుగో తేదీన చలో పార్లమెంట్‌ కార్యక్రమాన్ని చేపడతామని వారు పిలుపునిచ్చారు. పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని అన్నారు. దళితులు అన్ని రంగాల్లో అసమానతలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, సంస్థలు, ప్రజాస్వామిక వాదులంతా ఆలోచించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. వివక్ష, దోపిడీ, పీడన, అణచివేత, వెలివేతకు గురవుతున్న దళితులకు అండగా నిలవాలని సూచించారు. అంటరానితనం దేశంలో లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఆ దిశగా ఈ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని చెప్పారు.