– వచ్చే నెల 3న విచారిస్తాం : హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు జాగాకు సంబంధించి గతంలోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్‌ఓసీ కమిటీ చైర్మెన్ ఆధ్వర్యంలోని నవీన్ మిట్టల్ కమిటీ ఇచ్చిన ఎన్‌ఓసీ ఉత్తర్వుల వ్యవహారంపై వచ్చే నెల 3న విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు ప్రయివేటు వ్యక్తులకు జారీ చేసిన ఎన్‌ఓసీ అంశంలో దర్యాప్తును సిట్ లేదా సీబీఐల్లో ఒకరికి అప్పగించాలన్న మధ్యంతర పిటిషన్‌పై విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రకటించింది. గుడిమల్కాపూర్‌లోని 5,262 గజాల స్థలానికి ఎన్వోసీ జారీ చేయడంపై దర్యాప్తును సిట్‌కు లేదా సీబీఐకి అప్పగించాలని కోరుతూ శాంతి అగర్వాల్ మధ్యంతర పిటిషన్ వేశారు. ఎన్‌ఓసీ నిర్ణయాన్ని సింగిల్ జడ్జి రద్దు చేశారనీ, అందుకు కారణమైన నాటి కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ వి.వి.దుర్గాదాస్, తహశీల్దార్లు మధుసూధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలపై శాఖాపర చర్యలు తీసుకోవాలనీ, ఎన్‌ఓసీ పొందిన ప్రయివేటు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు అమలు కావడం లేదని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. సిట్ లేదా సీబీఐకి దర్యాప్తు బదిలీ చేయాలని కోరగా, దీనిపై అక్టోబర్ 3న విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.