ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లపై

సుప్రీం ఆదేశాల అమలుకు తీరిక లేదా?: హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ట్రాన్స్‌జెండర్‌ లేదా ఎస్సీ కోటాల్లో పిటిషనర్‌కు నీట్‌ పీజీ సీటు కేటాయింపునకు చర్యలు తీసు కోవాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌ కోరిన కేటగిరీ (గైనకాలజీ)లో సీటు రాకపోతే పిటిషనర్‌కు ఉన్న అర్హతల ప్రకారం మెరిట్‌కు అనుగుణంగా ఏ కేటగిరీ లో సీటు వస్తే ఆ సీటు ఇవ్వాలంది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల కల్పన అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కర్నాటకలో మార్గదర్శకాలు జారీ అయ్యా యనీ, అదే విధంగా తెలంగాణలో కూడా చేయాలని చెప్పింది. నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ల ప్రస్తావన లేదంటూ డాక్టర్‌ కొయ్యల రూత్‌ జాన్‌ పాల్‌ దాఖలు చేసిన రిట్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రయివేటు వ్యక్తులదే స్థలం
బేగంపేటలో గ్రీన్‌ల్యాండ్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద 3,500 గజాల స్థలం ప్రయివేటు వ్యక్తులదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వే నెంబర్‌ 214/1లోని స్థలంపై హక్కుల కోసం చంద్ర రేఖ ఇతరులు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పి.మాధవీదేవి తీర్పు చెప్పారు. అది ప్రభుత్వ భూమేనని అధికారులు ఆధారాలు చూపలేదని చెప్పింది.
సీఎస్‌ అఫిడవిట్‌ అస్పష్టత
సమాచార ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల నియామకాలు ఎప్పుటిలోగా చేస్తారో స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు అఫిడవిట్‌ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీరియస్‌ పరిశీలనలో ఉందంటూ ఇతర వివరాలు లేకుండా సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. గడువు కావాలని మళ్లీ ప్రభుత్వ న్యాయవాది కోరడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. సమాచార కమిషనర్ల నియామకానికి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరపు కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. జులై 5న జరిగే విచారణలోనైనా స్పష్టంగా చెప్పాలంది. ఆ విచార ణకు ఏజీ లేదా అదనపు ఏజీ విచారణకు రావాలంది.