నిన్నటి దాకా ఒక లెక్క..నేటి నుంచి మరో లెక్క..

A count till yesterday.. Another calculation from today..– ఉద్యోగ, కార్మికులను విస్మరిస్తే.. రాష్ట్రానికి ఫీవర్‌ తప్పదు
– హామీలు అమలు చేయకపోతే.. ఎక్కడి చెత్త అక్కడే
– ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే లోపు సమస్యలు పరిష్కరించాలి
– గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అత్యంత వెనుకబడిన, కడు పేదరికంలో బతుకుతున్న గ్రామ పంచాయతి ఉద్యోగ, కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనీ, ఇది కచ్చితంగా చట్టబద్ద నేరమేనని వక్తలు విమర్శించారు. సర్కారు హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయనీ, మల్టీపర్పస్‌ విధానం పేర వారితో వెట్టి చాకిరి చేయించుకోవటం తగదనీ, ఆ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న..ఓడ దాటినంక బోడి మల్లన్న అన్నట్టుగా హామీలు ఇచ్చి .. ఎన్నికలైపోయాక తెడ్డు చూపాలని భావిస్తే..నిన్నటి దాకా ఒక లెక్క..నేటి నుంచి మరో లెక్కలా ఉంటుందని హెచ్చరించారు. పర్యాటక స్వర్గధామమైన ఫ్రాన్స్‌, దాని రాజధాని పారిస్‌ ప్రజలకు నల్లులు నరకం చూపిస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే జ్వర తెలంగాణగా మారిన రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కరించకుంటే.. రాష్ట్రానికే ఫీవర్‌ పట్టుకుంటుందని హెచ్చరించారు. గొర్రెతోక బెత్తెడు వేతనాలతో, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువల ధరలతో ఎలా బతికేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ విధానాల ఫలితంగానే సామాన్యులకు అందనంతగా ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గ్రామ పంచాయతి ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్మికులు తరలి వచ్చారు. ‘మా సమస్యలు పరిష్కరించని సర్కార్‌ మాకొద్దు’ ‘పంచాయతి సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలి’. ‘వేతనాలు పెంచాలి’ ‘మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలి’ ‘కారోబార్‌, బిల్‌కలెక్టర్లు, గుమస్తాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి’ అంటూ పెద్దపెట్టున వారు నినాదాలు చేశారు. ధర్నాకు శ్రామిక మహిళలు పెద్దఎత్తున కదిలి వచ్చారు. సద్దిమూటలు సంకనబెట్టుకుని ఎర్రజెండా చేబూని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే..రాబోయే ఎన్నికల్లో తడాఖా చూపిస్తామంటూ..స్లోగన్స్‌ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే..కల్లబొల్లి మాటలతో బొంకుతున్నదని విమర్శించారు. పాత పీఆర్‌సీ ప్రకారం పెంచాల్సిన వేతనాన్ని పెంచకుండా..తప్పుడు మాటలు చెబుతూ, కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని చెప్పారు. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని అమలు చేయటమంటే..బానిస విధానాన్ని ముందుకు తీసుకురావటమేనన్నారు. క్యాటగిరీల వారిగా గుర్తింపు ఇవ్వటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. దళిత, గిరిజనులకు ఎంతో చేస్తున్నామని ఊదరగొడుతున్న ప్రభుత్వం.. సామాజికంగా వెనుకబడి, ఈ ‘చెత్త’పని చేస్తున్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే..సారా సీసాకో, కాసులకో ఓటును కొనుక్కోవచ్చనే ధీమాతో పాలకులున్నారని చెప్పారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించకుండా ఓటడిగే హక్కు మీకు లేదని తెగేసి చెప్పాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు. మూడు నాలుగు రోజుల్లో తమ సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి(ఏఐటీయూసీ) ఎండీ యూసఫ్‌, జేఏసీ సలహాదారు (ఐఎఫ్‌టీయూ) కె సూర్యం, అనురాధ, ఎన్‌.దాసు,చాగంటి వెంకటయ్య, పి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ 34 రోజులుగా చేసిన సమ్మె సందర్భంగా మంత్రి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె విరమణకు ముందు, ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడే మాటలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు.వేతనాల పెంపు,పర్మినెంట్‌,స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వడంతో పాటు సిబ్బందిని పీఆర్‌సీ పరిధిలోకి తీసుకురావటంతో పాటు ప్రధాన సమస్యలను ప్రభుత్వం పక్కకు పెట్టిందని తెలిపారు. కార్మికులు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10వేలు, రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ కల్పిస్తామంటూ స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సర్క్యులర్‌ జారీ చేశారని గుర్తు చేశారు. ఆ సర్క్యులర్‌లో విధివిధానాలు నిర్ణయించకుండానే ఉత్తర్వులు జారీ చేయటమేంటని ప్రశ్నించారు.బతకటానికి కడుపునింపమని కోరితే..చనిపోతే సాగనంపటానికి ఖర్చులు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పి శివబాబు, ఎన్‌ నర్సింహారెడ్డి,జయచంద్ర, పొట్ట యాదయ్య గ్యార పాండు, పాలడుగు సుధాకర్‌, పి గణపతి రెడ్డి, మదుసూదన్‌రెడ్డి , జె వెంకన్న, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.