– హత్యకు సహకరించిన మరో నిందితుడికి 34 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
– శిక్షలను విధించిన నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
– వివరాలు వెల్లడించిన నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్
నవతెలంగాణ-కంటేశ్వర్
తాను పని చేస్తున్న ఇంటి యజమాని భార్యపై కన్నువేసి ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా హత్య చేసి, చేతబడి అని నమ్మించేందుకు యత్నించిన ఇద్దరిలో ఒకరికి 44 సంవత్సరాలు, సహకరించిన వ్యక్తికి 34 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సంచలన తీర్పును వెలువరించారు. నిజామాబాద్ జిల్లాలో తొలిసారి ఒక్క కేసులో జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ఒకరికి ఏకకాలంలో 44 సంవత్సరాలు, సహకరించిన మరొకరికి 34 సంవత్సరాల కఠినకారాగార విధించడం జరిగిందని నిజామాబాద్ ఏసీపీ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగపేట్ మండలం ముంబాజిపేట్ గ్రామానికి చెందిన పసులాడి నాగరాజు, నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుమ్మల నాగేష్ కుమార్ ఆలియాస్ నాగరాజు ఆలియాస్ రాజులు నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ లో నివాసం ఉండి శ్రీనివాస్ అనే మేస్త్రీ వద్ద కూలీలుగా పని చేసేవారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఇళ్ల నిర్మాణం చేస్తూ నగరంలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ ఇంట్లో నాగరాజు, నగేష్ లు పని చేసేవారు. ఆ సమయంలో నాగరాజు మేస్త్రీ భార్యపై కన్నేశాడు. 2020 హోలీ పండుగనాడు ఒంటరిగా ఉన్న మేస్త్రీ భార్యను లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తనతో ఉన్న నగేష్ తో కలిసి నాగరాజు ఆమెను దారుణంగా హత్య చేశాడు. తలపై రాడ్డుతో కొట్టి మట్టుబెట్టాడు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా తుడిచివేశాడు. ఆ రోజు పౌర్ణమి కావడంతో చేతబడి చేసి బలిచ్చిన విధంగా నమ్మించేందుకు నిమ్మకాయలు కోసి, దీపం వెలిగించి ఇళ్లంతా పసుపు, కారం చల్లేశాడు. నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి నగర సీఐ సత్యనారాయణ, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సె లక్ష్మయ్యలు కేసు నమోదు చేసి నాగరాజు, నగేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ కేసులో నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల తన తీర్పులో వివిధ సెక్షన్ల కింద నాగరాజుకు 44, నగేష్కు 34 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కాగా పసులాడి నాగరాజుపై డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో రౌడిషీట్ కేసు నమోదై ఉందని ఏసీపీ తెలిపారు. నాగరాజు మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించడంతో ఆ కేసులో ఎస్సీ ఎస్టీ, ఫోక్సో కేసు నమోదు కావడంతో ఆ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నాగరాజు పై నగరంలోని 4 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో, 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులలో నాగరాజుకు శిక్ష పడే అవకాశం ఉందని, అతడు జీవితకాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సీఐ నరహరి నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.