ఏక కాలంలో రూ.లక్షలోపు రుణమాఫీ చేయాలి

సీఎం కేసీఆర్‌కు రైతు సంఘం బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం 2018డిసెంబర్‌ 13న రైతుల రుణం లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రుణాన్ని నాలుగు వార్షిక విడతలలో మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అయితే దీన్ని ఏకకాలంలోనే మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రైతు సంఘం బహిరంగ లేఖ రాసింది. ఆ లేఖను సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ 2014ఏప్రిల్‌1 నుంచి 2018 డిసెంబర్‌ 11మధ్య రుణం పొందిన వారికి రూ.21,557 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. మొదటి విడతగా రూ.25 వేల లోపు రుణం 5.83 లక్షల మంది రైతులకు రూ.1,198 కోట్లు ఇచ్చి ఒకే విడతగా రుణమాఫీ చేయడంతోపాటు మిగిలిన రుణం నాలుగు విడతలలో మాఫీ చేస్తామని సీఎం ప్రకటించినట్టు గుర్తుచేశారు.
రూ.50 వేల లోపు రుణానికి ప్రభుత్వం నిధులు జమ చేసిందని తెలిపారు. 2018-19 నుంచి 2023-24 వరకు బడ్జెట్లలోగానీ, సవరించిన బడ్జెట్లతో సహా రూ.16,261 కోట్లు కేటాయించడం జరిగిందని, ప్రభుత్వం చెప్పిన 5వ విడత 2023-24తో ముగిసిపోతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న రైతుల రుణమాఫీ బాకీని ఒకే విడతగా ప్రభుత్వం విడుదల చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, వారి రుణాలను తిరగరాసి బుక్‌ అడ్జెస్ట్మెంట్‌ చేస్తున్నారని వివరించారు. రైతులు తమ అంచనా ప్రకారం రూ.20 వేల కోట్లు అధిక వడ్డీలకు ప్రయివేట్‌ రుణాలు తెచ్చి వ్యవసాయాలు సాగిస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన మాఫీలో మొత్తం 40.66 లక్షల మంది రైతులు రూ.21,557 కోట్లు బాకీ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన మేరకు రైతుల రుణమాఫీకి నిధులు విడుదల చేయాలని కోరారు. వ్యవసాయం కోసం నగలు తాకట్టు పెట్టిన వారికి కూడా రూ.లక్ష లోపు మాఫీ చేస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు గుర్తుచేశారు. నగలు కుదువ పెట్టిన వారి బాకీలను కూడా విడుదల చేయాలని కోరారు. పై సమస్యపై సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని వెంటనే తగు నిధులు విడుదల చేయాలని కోరారు. 2023 వానాకాలం పంటలు వేస్తున్నారని, ప్రస్తుతం రైతులకు పెట్టుబడి చాలా అవసరమని, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధుతోపాటు బ్యాంకు రుణాలు కూడా అందుబాటులోకి వస్తే రైతుల పెట్టుబడికి ఇబ్బంది తప్పుతుందని తెలిపారు.