ఒకరు రమ్మంటున్నరు…ఇంకొకరు వద్దంటున్నరు

One doesn't want to come...the other doesn't want to– మొన్న కృష్ణయాదవ్‌.. నేడు చికోటి ప్రవీణ్‌
– చేరికలపై బీజేపీ వింత పోకడ
– నేతల మధ్య ఆధిపత్య పోరే కారణం?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్నా ఆధిపత్య పోరు మాత్రం అట్లాగే కొనసాగుతున్నది. మొన్నటిదాకా బండి గ్రూపు వర్సెస్‌ ఈటల గ్రూపు అన్నట్టు ఉండగా..నేడు అది కాస్తా ఈటల వర్సెస్‌ కిషన్‌రెడ్డిగా మారింది. పార్టీలోకి ఒకరు రండి బాబూ..రండి అని ఆహ్వానిస్తుండగా..మరొకరు ఛల్‌ర బై ఛల్‌ అని అడ్డుపుల్ల వేస్తున్నారు. ఎన్నికల వేళ చేరికలకు అన్ని పార్టీలు మొగ్గుచూపుతుండగా బీజేపీ వచ్చిన వారికి వెనక్కి తిప్పిపంపుతున్నది. దీంతో ఆ పార్టీలో చేరాలనుకునే వారు కూడా ఈ వింత పరిస్థితిని చూసి వెనకడుగు వేస్తున్నారు. కృష్ణయాదవ్‌, చికోటి ప్రవీణ్‌ చేరుతారనే వార్తలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ విషయంలో పార్టీ అగ్రనేతల తీరుపై క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఈటల రాజేందర్‌ ఆయన చేరిక కోసం చాలా కసరత్తు చేశారు. ఆయన చేరిక కూడా దాదాపు ఫైనల్‌ అయిపోయింది. రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతారనే ప్రకటన కూడా వచ్చింది. ఇంతలోనే ఆయన చేరిక ఆగిపోయింది. ఆయన చేరికకు కిషన్‌రెడ్డినే అడ్డుపుల్ల వేశారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకవేళ కృష్ణయాదవ్‌ పార్టీలో చేరితే ఆయన చేతుల్లో అంబర్‌పేట నియోజకవర్గాన్ని అప్పనంగా పెట్టాలి. ఇది కిషన్‌రెడ్డికి సుతారమూ ఇష్టం లేదని వినికిడి. ఆ నియోజకవర్గం నుంచి తానుగానీ, తన భార్యనుగానీ రంగంలోకి దింపాలని ఆయన భావించడమే దీనికి కారణం అని తెలుస్తున్నది. తాజాగా చికోటి ప్రవీణ్‌కుమార్‌ బీజేపీలో చేరేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. పలు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రకటనా వెలువడింది. తన అనుచరగణంతో కర్మన్‌ఘాట్‌ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరకున్న చికోటి ప్రవీణ్‌కు వింత అనుభవం ఎదురైంది. పార్టీలో చేరేందుకు రమ్మని పిలిచిన లీడర్లు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరిక కోసం ముందే డేట్లు ఫిక్స్‌ చేసిన సీనియర్‌ నేతలు ఎందుకు అందుబాటులో లేరని గుస్సా అయ్యారు. జాతీయ స్థాయి బీజేపీ నేతలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చికోటి తెలిపారు. సీనియర్‌ నేతలు అందుబాటులో లేకపోవడంతో చేరికకు బ్రేక్‌ పడిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ నేత ఈ చేరికకు అడ్డుపుల్ల వేశారని ప్రచారం జరుగుతున్నది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈటల రాజేందర్‌ స్వయంగా ఆయన ఇంటికెళ్లి సంప్రదింపులు, బుజ్జగింపులు చేసి వచ్చారు. ఆయనా కాస్త మెత్తపడ్డారు. కానీ, ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగానీ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన వ్యక్తి ఇంటికి ఎలా వెళ్తావు? అంటూ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు ఆయనపై గుస్సా అయ్యాయి. దీనంతటికీ కిషన్‌రెడ్డినే కారణమనే ప్రచారమూ అప్పట్లో జోరుగా సాగింది. మొత్తంగా ఇప్పుడు ఈటల వర్సెస్‌ కిషన్‌రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైందనీ, ఈ ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో అని పార్టీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.