న్యూఢిల్లీ : చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమై జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు పెట్టిన తొలి దేశంగా భారతావని ఆవిర్భవించినందుకు అందరం సంతోషించాం. ఇప్పుడు ఉల్లి ధరలు కూడా చందమామను తాకేందుకు తహతహలాడుతు న్నాయి. నిన్నటి వరకూ వంద రూపాయలకు ఆరేడు కిలోల ఉల్లిగడ్డలు లభించేవి. కానీ ఇప్పుడో…రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో 30 నుండి 50 రూపాయలు పలుకుతోంది. ఉల్లి పంటను అత్యధికంగా సాగు చేసే నాలుగు ప్రధాన రాష్ట్రాలలో గత నెల రోజులుగా హోల్‌సేల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 సమాచారం ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా (43%) ఉల్లిని సాగు చేస్తుండగా మధ్యప్రదేశ్ (15%), కర్నాటక (9%), గుజరాత్ (8%) ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి. అంటే దేశంలోని మొత్తం ఉల్లి దిగుబడులలో ఈ నాలుగు రాష్ట్రాలలోనే నాలుగింట మూడో వంతు ఉత్పత్తి జరుగుతోంది. జూలై చివరి వారంలో హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.1,161 పలికింది. నెల రోజుల తర్వాత అది 60% పెరిగి రూ.1,819కి చేరింది. 2022లో ఇదే కాలంలో ధరలు స్థిరంగానే ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆగస్ట్ 16-23 తేదీల మధ్య ధరలు సుమారు 80% పెరిగాయి. ఇవి ఉల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే నాలుగు రాష్ట్రాలలోని హోల్‌సేల్ ధరలు మాత్రమే. బడా వ్యాపారులు ఈ రాష్ట్రాలలో ఉల్లిని కొనుగోలు చేసి, దేశంలోని పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తారు. అక్కడి నుండి గ్రామీణ ప్రాంతాలకు చేరతాయి. ఇలా అంచెలంచెలుగా వినియోగదారుడి వద్దకు చేరేసరికి ధర బాగా పెరిగిపోతుంది. 2022-23లో దేశంలో 318 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ఉల్లి ఉత్పత్తి జరిగింది. శీతాకాలపు పంటలో దిగుబడులు బాగా ఎక్కువగా రావడంతో మార్చిలో హోల్‌సేల్ మార్కెట్లలో కిలోకు ఒకటి రెండు రూపాయల ధర మాత్రమే పలికింది. దీంతో చాలా మంది రైతులు పంటను పొలాలలో అలాగే వదిలేశారు. మరోవైపు ఎగుమతులు కూడా పెరిగాయి. రైతులు ఎక్కువగా ఎగుమతి వ్యాపారం చేసే వారికే తమ పంటను విక్రయించారు.
పరిస్థితి తలకిందులు
వాతావరణంలో వచ్చిన మార్పులు ఒక్కసారిగా పరిస్థితిని తలకిందులు చేశాయి. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు పంటను దెబ్బతీశాయి. ఉల్లి సరిగా పెరగకముందే పండిపోయింది. ఆ తర్వాత అకాల వర్షాలు. గాలిలో తేమ శాతం పెరగడంతో పంటకు ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు సోకాయి. దీంతో పంటను త్వరత్వరగా తీసేయాల్సి వచ్చింది.
దేశంలో మూడు పంటలు
మన దేశంలో ఉల్లిని మూడు పంటలుగా…రబీ, ఖరీఫ్, లేట్ ఖరీఫ్…సాగు చేస్తారు. వీటిలో రబీ పంటలోనే అధికంగా అంటే 70% వరకూ దిగుబడులు వస్తాయి. సరఫరాలు శీతాకాలం చివరలో ప్రారంభమై వర్షాలు మొదలయ్యే వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత ఖరీఫ్ పంట సాగు ప్రారంభమవడంతో సెప్టెంబర్ వరకూ సరఫరాలకు ఢోకా ఉండదు. ఖరీఫ్ చివరలో వేసే పంట శీతాకాలం ప్రారంభం వరకూ సరఫరాలను అందిస్తుంది.
అయితే ఉల్లిని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లలో నిల్వ చేయడం సాధ్యంకాదు. గాలి బాగా సోకే బహిరంగ ప్రదేశాలలో మాత్రమే నిల్వ చేయగలం. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉల్లి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో ఖరీఫ్ పంట నిల్వలు అయిపోతుంటాయి. తర్వాత సీజన్‌లో వేసే పంట అప్పటికి ఇంకా చేతికి రాదు. ఏదేమైనా ఉల్లి ధరలు పెరిగిన తర్వాత కానీ ప్రభుత్వం మేలుకోలేదు. ముందుగా ఎగుమతులపై 40% పన్ను విధించింది. ఆ తర్వాత రైతుల నుండి పంట సేకరణ జరుపుతామని ప్రకటించింది. సేకరణ లక్ష్యాన్ని పెంచుతామని కూడా తెలిపింది. అయితే దిగుబడులు సరిగా లేకపోవడం, మార్కెట్‌లోకి చాలినంత సరుకు రాకపోవడంతో సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంటున్నారు.