– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్ అన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన గునుకుల మల్లయ్య, గునుకుల సోమయ్యను బోడకొండ ఖిల్లాపై నైజాం రజాకార్లు సజీవ దహనం చేశారు. ఆ ప్రాంతాన్ని శనివారం సీపీఐ(ఎం) బృందం సందర్శించింది. అనంతరం మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. పన్ను శిస్తులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేస్తున్న గునుకుల మల్లయ్య, సోమయ్యను రజాకార్లు బోడకొండ గుట్టపైకి తీసుకెళ్లి అతిదారుణంగా సజీవ ఖననం చేశారని తెలిపారు. తర్వాత ప్రజలంతా ఏకమై రజాకార్ల మూకలతో పోరాటం సాగించారని గుర్తు చేశారు. రాచకొండ కేంద్రంగా కామ్రేడ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని రాజకీయ పార్టీలు నేడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది కేవలం కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని తెలిపారు. మూడు వేల గ్రామాలకు నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పోరాటానికి మతం రంగు పూసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సాయుధ పోరాట చరిత్రను తెలుసుకుని భవిష్యత్ ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, మధుసూదన్‌రెడ్డి, బి.సామేల్, మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌సుందర్, నాయలకు దుబ్బాక రాంచందర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఏ.నర్సింహ, ఆర్.జంగయ్య, సిహెచ్.జంగయ్య, జీ.నర్సింహ, పి.అంజయ్య, డి.కిషన్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుమలత తదితరులు పాల్గొన్నారు.