నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ శాఖ ఆపరేటర్ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే బూర్గంపాడు మండలానికి చెందిన కొత్తపల్లి రమేష్ మండలంలోని ఏడూళ్ళ బయ్యారం విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సబ్ స్టేషన్ యార్డ్‌లో ఫీడర్ ఆన్ చేస్తుండగా, ఒక్క సారిగా విద్యుత్ ప్రసరించడంతో షాక్ గురయ్యాడు. వెంటనే గమనించిన విద్యుత్ సిబ్బంది పినపాక ప్రభుత్వ అసుపత్రికి వైద్యం కోసం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. మణుగూరు ఏరియా ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అందరితో కలివిడిగా కలిసి ఉండే ఉద్యోగి మృతి చెందడంతో విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు.