తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట..

In front of Tehsildar office..– తండ్రి కొడుకుల ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-రఘునాథపాలెం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం తహసీల్దార్‌ అక్రమంగా తమ భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారంటూ తండ్రీ కొడుకులు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుడిదంపాడు గ్రామ పంచాయతీకి చెందిన దుదుకురి షాజీరావు, అతని కుమారుడు విద్యాసాగర్‌ 2005లో మంచుకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్‌ 231/ఆ/1లోని 1.26 ఎకరాలు, 233/అ లోని 2.39 ఎకరాలతో కలిపి మొత్తం 4.24 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, రెవెన్యూ కార్యాలయం నందు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలో ఉంది. నాటి నుంచి భూమిని కౌలుకు ఇస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రతి రైతుకు సాగులో ఉన్న భూముల కొత్త పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయగా.. దాని కోసం ఈ తండ్రి కొడుకులు అప్పటి వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా కేవలం 3 ఎకరాలకే పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని మంజూరు చేశారు. మిగతా 1.24 ఎకరాల భూమి పాసుపుస్తకంలో ఎక్కలేదు. అప్పటి నుంచి రఘునాథపాలెం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నా పని కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2017లో ఈ తండ్రి కొడుకులు అదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి మోహన్‌ రావు దగ్గర కొత్త డబ్బు అప్పుతీసుకున్నారు. దానికోసం ఖాళీ దస్తావేజుపై సంతకాలు పెట్టించుకున్నారు. ఆ వ్యక్తి ఆ దస్తావేజులపై 2 ఎకరాల భూమి రాయించుకొని అక్రమంగా సాదా బైనామా ద్వారా పట్టాదారు చేయించుకున్నాడని ఆరోపిస్తున్నారు.
ఈ భూములు కోర్టు కేసులో ఉన్నాయని తహసీల్దార్‌కి అభ్యంతరాలు పెట్టామన్నారు. కానీ ఆ సర్వే నెంబర్‌లోని 22 గుంటల భూమిని గురువారం వేరే వ్యక్తికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించడానికి అప్పిచ్చిన వ్యక్తి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న తండ్రి కొడుకులు ఇద్దరూ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి అడ్డుకున్నా వినకపోవడంతో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ శ్రీధర్‌ను కలిసి ఉన్న విషయాన్ని వివరించారు. కాగా, దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. తుమ్మలపల్లి మోహన్‌ రావు అనే వ్యక్తికి పట్టాదారు పాసు పుస్తకం ఉన్నది. కాబట్టి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ చేసిన దానిలో సర్వే నెంబర్లు వేరే ఉన్నాయని, తండ్రీకొడుకులు చెబుతున్న సబ్‌ నెంబర్లు వేరే అని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారు చెప్పిన విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.