38 ఎకరాలను అప్పగించేలా ఆదేశాలివ్వండి

– సీఎం కేసీఆర్‌కు జేఎన్‌జే విజ్ఞప్తి
– ఆగస్టు 10లోపు అప్పగించకుంటే నిరవధిక దీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేట్‌ బషీరాబాద్‌ సర్వే నెంబర్‌ 25/2లోని 38 ఎకరాలను సొసైటీకి అప్పగించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ‘సొసైటీ 2011లో 70 ఎకరాలకుగాను రూ.12.33 కోట్లను ప్రభుత్వానికి చెల్లించింది. ముఖ్యమంత్రి సూచనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 2018లో నిజాంపేట్‌లోని సర్వే నెంబర్‌ 332లో 32 ఎకరాలను సొసైటీకి అప్పగించింది. మిగిలిన 38 ఎకరాలను అప్పగించాలని 2022 ఆగస్టు 25న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ఆగస్టు 10లోపు అప్పగించకుంటే హెచ్‌ఎండీఏ ప్రాంగణంలో నిరవధిక దీక్షలకు కూర్చుంటామని.. సమావేశం హెచ్చరించింది. ఇప్పటికే 60 మంది సొసైటీ సభ్యులు చనిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పలు వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమావేశం ప్రశంసించింది.
అదే విధంగా సొసైటీ చట్టబద్ధంగా చేస్తున్న వినతిని ఆమోదించాలని కోరింది. సీఈవో ఎన్‌.వంశీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది సహకారంతో నిజాంపేట్‌లో ఆక్రమణలు తొలగించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. అదే విధంగా పేట్‌ బషీరాబాద్‌లో ఆక్రమణలు, న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్‌, కమిటీ సభ్యులు బీ.ఎన్‌.జ్యోతి ప్రసాద్‌, కె.రవికాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.